తాడ్వాయి, వెలుగు : మేడారం మహాజాతరకు మరో 20 రోజులే ఉండడంతో ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తుల రాకతో మేడారం పరిసరాలన్నీ కిటకిటలాడాయి. పిల్లాపాపలతో తరలివచ్చిన భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి, కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు.
అనంతరం సమ్మక్క, సారలమ్మను దర్శించుకొని నిలువెత్తు బంగారం, చీర, సారెలను సమర్పించి, కోళ్లను ఎదురు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అటవీ ప్రాంతంలోనే భోజనాలు చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో అమ్మవార్ల గద్దెల గేట్లకు తాళాలు వేశారు.
మినీమేడారం జాతర పనులకు రూ. 16 లక్షలు
మొగుళ్లపల్లి, వెలుగు : భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ములకలపల్లి మొగుళ్లపల్లి గ్రామాల మధ్య జరిగే మినీ మేడారం జాతర అభివృద్ధికి ప్రభుత్వం రూ. 16 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో తాత్కాలిక మరుగుదొడ్లు, స్నాన ఘట్టాల ఏర్పాటు, జాతర ప్రాంగణం ఆవరణలో సీసీ రోడ్లు వేయడంతో పాటు, ఇతర పనులు చేయనున్నారు.