- కన్నెపల్లి నుంచి మేడారం గద్దె మీదికి కదిలొచ్చిన సారలమ్మ
- కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు రాక
- ఇయ్యాల చిలకలగుట్ట నుంచి తరలిరానున్న సమ్మక్క.. 4 రోజుల మహాజాతర షురూ
- తొలిరోజే 25 లక్షల మంది భక్తుల దర్శనం
మేడారం నెట్వర్క్, వెలుగు : రెండేండ్లకోసారి నాలుగురోజుల పాటు జరిగే మేడారం మహాజాతర బుధవారం ప్రారంభమైంది. భక్తులు వరాలు పట్టంగ సారలమ్మ కన్నెపల్లి నుంచి కదిలొచ్చింది. డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాల నడుమ బుధవారం అర్ధరాత్రి 12.12 గంటలకు భారీ బందోబస్తు నడుమ గిరిజనపూజారులు సారలమ్మను గద్దెలపైకి ప్రతిష్టించారు. అమ్మను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. కొండాయి నుంచి గోవిందరాజులు, పూనగండ్ల నుంచి పగిడిద్దరాజును కూడా పూజారులు గద్దెలపైకి చేర్చి.. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.
మరోవైపు మహాజాతర మొదటిరోజైన బుధవారం సాయంత్రం 6 గంటల కల్లా 25 లక్షల మంది భక్తులు మేడారం చేరుకున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ఎటుచూసినా వనమంతా జనంతో నిండిపోయి కనిపిస్తున్నది. గురువారం సమ్మక్కను తోడ్కొచ్చే కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రభుత్వ లాంఛనాల ప్రకారం గౌరవ సూచకంగా కాల్పులు జరిపి, సమ్మక్కకు ఎదుర్కోలు వేడుక నిర్వహిస్తారు. సమ్మక్క కొలువుదీరనున్న నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో జాతరలో భక్తుల సంఖ్య కోటికి చేరే అవకాశముందని అధికారులు చెప్తున్నారు.
మేడారం జన గుడారం!
మేడారం వన దేవతలను దర్శించుకునేందుకు బుధవారం సాయంత్రానికి 25లక్షలకు పైగా భక్తులు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గఢ్, ఒడిసా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. రెండు, మూడు రోజుల పాటు ఉండేందుకు గుడారాలు వేసుకున్నారు. కన్నెపల్లి, నార్లాపూర్, మేడారం.. ఇలా నలువైపులా ఎటుచూసినా గుడారాలే కన్పిస్తున్నాయి. మహాజాతర తొలిరోజు సారలమ్మ రాకకు ముందే భక్తులు పెద్ద సంఖ్యలో గద్దెలను దర్శించి మొక్కులు సమర్పించుకున్నారు.
బుధవారం మధ్యాహ్నం కల్లా గద్దెలన్నీ సగం మేర బంగారం(బెల్లం)తో నిండిపోయాయి. కల్యాణ కట్టల వద్ద తలనీలాలు సమర్పించి, జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసిన భక్తులు నేరుగా బంగారం నెత్తిన పెట్టుకొని గద్దెల వద్ద క్యూ కడ్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా రెండు వైపులా క్యూలైన్లు ఏర్పాటుచేశారు. బుధవారం ఉదయం జంపన్నవాగు నుంచి ఒకే సారి పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవార్ల దర్శనానికి రావడంతో ఒత్తిడి ఎక్కువైంది. అదే సమయంలో అంబులెన్స్‌లు ఎదురెదురుగా వచ్చి ట్రాఫిక్ జామ్ అయింది. భక్తులంతా రెండు గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. ఐటీడీఏ క్యాంప్ ఆఫీస్ నుంచి కాకతీయ హరిత హోటల్ వరకు రోడ్డు పొడవునా భక్తుల క్యూలైన్లు పేరుకుపోయాయి.
నేడు గద్దెకు రానున్న సమ్మక్క
మేడారం మహాజాతరలో సమ్మక్క రాక ఒక అపూర్వఘట్టం. ఈ వేడుకను ప్రభుత్వ లాంఛనాల ప్రకారం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. గిరిజన పూజారులు గురువారం చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెపైకి తీసుకువస్తారు. ఈ వేడుక కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సమ్మక్క తల్లిని గద్దెలపైకి చేర్చే ప్రక్రియ గురువారం ఉదయమే మొదలవుతుంది. గిరిజన పూజారులు ఉదయం 5.30 గంటలకు వనం గుట్టలోని అడవిలోకి వెళ్లి కంకవనం(వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. మేడారంలోని సమ్మక్క గుడి నుంచి వడెరాల(కొత్త కుండలు)ను తెచ్చి గద్దెలపైకి చేరుస్తారు.
అనంతరం కుంకుమ భరిణె రూపంలోని సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు, వడ్డెల బృందం మధ్యాహ్నం మూడు గంటలకు చిలకలగుట్టపైకి వెళ్తుంది. ఆ సమయంలో సమ్మక్క రాక కోసం లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు. దీంతో చిలుకలగుట్ట ప్రాంతంలో ఒకరకమైన ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొంటుంది. ప్రధాన పూజారి కక్కెర కృష్ణయ్య గుట్ట పైనుంచి కుంకుమభరిణె రూపంలోని అమ్మవారిని తీసుకొస్తారు. ప్రధాన పూజారి ఒక్కరే గుట్టపైకి నడుచుకుంటూ వెళ్లి అక్కడ రహస్య ప్రదేశంలో ఉన్న సమ్మక్క వద్ద సుమారు మూడు గంటల పాటు పూజలు చేస్తారు.
పూజారిపై దేవత పూనిన వెంటనే కుంకుమ భరిణె రూపంలోని అమ్మవారిని తీసుకొని అతివేగంగా గుట్ట పైనుంచి కిందికి వస్తారు. సమ్మక్క ఆగమనానికి సూచనగా జిల్లా ఎస్పీ ఏకే 47తో గాలిలోకి కాల్పులు జరుపుతారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికార యంత్రాంగం అంతా చిలుకలగుట్ట కిందే ఉంటారు. సమ్మక్క ఎదుర్కోళ్ల కార్యక్రమానికి 500 మందికి పైగా పోలీసులను నియమించారు. రోప్ పార్టీని కూడా ఏర్పాటుచేశారు. మూడంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు ములుగు జిల్లా పోలీస్ శాఖ ప్రకటించింది.
అలికి.. ముగ్గులు పెట్టి..!
మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రారంభం నేపథ్యంలో గిరిజన పూజారులు బుధవారం పొద్దటి నుంచి ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజలు చేశారు. ముందుగా మంత్రి సీతక్క ప్రధాన పూజారి సిద్దబోయిన జగ్గారావు ఇంటికి వెళ్లి ఆలయ శుద్ధి గురించి చర్చించారు. అనంతరం మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ గర్భగుడి దగ్గర, గద్దెల వద్ద పసుపు, కుంకుమతో వడ్డెరలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుళ్లను నీటితో శుద్ధి చేసి, అలికి ముగ్గులు వేశారు.
గొట్టు గోత్రం సంబంధీకులు మేడారం గ్రామంలోని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమ్మక్క గుడి పూజల్లో మూడో గొట్టు వంశస్తులైన సిద్దబోయిన వారి ఇంటి ఆడబిడ్డలు, 5వ గొట్టు వంశస్తులైన మల్లెల, జజ్జెరి, శేల వంశస్తుల ఆడబిడ్డలు ఇందులో పాల్గొన్నారు. కన్నెపల్లిలోని సారలమ్మ గుడిని కాక వంశస్తులు శుద్ధి చేసి ముగ్గులు పెట్టి అలంకరించారు.
వరం పట్టి.. అమ్మకు స్వాగతం
సారలమ్మను బుధవారం రాత్రి 7.28 గంటల సమయంలో ప్రధాన పూజారి కాక సారయ్య కన్నెపల్లిలోని గుడి నుంచి మొంటె(వెదురు బుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి బయలుదేరారు. మార్గమధ్యంలో జంపన్నవాగులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాల ప్రకారం ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు.
కన్నెపల్లి గుడి దగ్గరికి వచ్చి సారలమ్మకు ఆహ్వానం పలికారు. పిల్లలు పుట్టా లని కోరుకునే వాళ్లు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవాళ్లు, అవివాహితులు కన్నెపల్లిలో గుడి ఎదుట తడి బట్టలతో వరం పట్టారు. వరం పడుతున్న వారిపై నుంచి పూజారులంతా నడుచుకుంటూ ముందుకు సాగారు. సారలమ్మే తమ పైనుంచి నడిచివెళ్తున్నట్లుగా భక్తులు పరవశించిపోయారు.