కొలువుదీరిన తల్లులు.. కోటొక్క మొక్కులు

కొలువుదీరిన తల్లులు.. కోటొక్క మొక్కులు

గాల్లో చక్కర్లు కొట్టాల్సిందే..

మేడారం వనదేవతల దర్శనానికి వస్తున్న భక్తులు హెలికాప్టర్​ ఎక్కేందుకు క్యూ కడుతున్నారు. పోలీస్​క్యాంపు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్​నుంచి తుంబీ ఏవియేషన్​కు చెందిన హెలికాప్టర్​ట్రిప్పులు వేస్తోంది. ఒక్కరికి రూ.3,700 చార్జ్​చేస్తున్నారు. ట్రిప్పులో ఆరుగురిని ఎక్కించుకుంటున్నారు. మేడారం గద్దెలతోపాటు చిలుకలగుట్ట, కన్నెపల్లి, నార్లాపూర్, ఆర్టీసీ క్యాంపును చుట్టేస్తూ అటవీ ప్రాంతంపైనుంచి రయ్​ మంటూ తిరిగి వస్తున్నారు. మేడారంలో మూడు రోజుల్లో 200 ట్రిప్పులు కొట్టామని, వరంగల్​కు  2 ట్రిప్పులు వేశామని నిర్వాహకులు చెప్పారు.

ఇట్స్​ టాటూ టైం ! 

జాతరలో ఈసారి టాటూస్ స్టాల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇష్టమైన వారి పేరు, నచ్చిన దేవుడి బొమ్మ , ఫ్లవర్స్ , నేచర్ డిజైన్స్ ను టాటూగా వేయించుకోవడానికి యూత్ ఎక్కువగా ఇంట్రెస్ట్​చూపిస్తున్నారు. స్టాల్ ఓనర్స్ డిజైన్ ను బట్టి ఇంచ్ కు 40 నుంచి100 వరకు తీసుకుంటున్నారు. 

సీతక్క నోట మేడారం తల్లుల పాట

ములుగు ఎమ్మెల్యే సీతక్క మేడారంలో కొలువైన తల్లులు సమ్మక్క, సారలమ్మలపై పాట పాడారు. నిండు మనసుతో భక్తజనాన్ని దీవించే తల్లులను నోరారా తలుచుకుంటూ రాగమందుకున్నారు.  ‘కొండకోనల నడుమ గండాలు బాపెటి దయగల సారక్క గద్దెకు మొక్కాలో.’ అంటూ ఓ వెబ్ ​చానల్​కోసం స్టూడియోలో గడ్డం సంతోశ్​తో కలిసి సీతక్క గళమెత్తారు. ఈ పాటను యూట్యూబ్​లో అప్​లోడ్​ చేయగా ఒక్కరోజులోనే 52 వేలకు పైగా జనం చూశారు.

కుక్కలు, కోతులు కరుస్తున్నయ్​...తేళ్లు కాటేస్తున్నయ్​

మహా జాతరకు వచ్చే భక్తులకు హెల్త్​ డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో ట్రీట్​మెంట్​ అందిస్తున్నారు. గద్దెల ప్రాంగణంలో మెయిన్​ మెడికల్ ​క్యాంపుతో పాటు జాతర పరిసరాల్లో 20 క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ నెల 16 నుంచి ఇప్పటివరకు 15,142 మందికి ట్రీట్​మెంట్​అందించినట్లు డీఎంహెచ్​ఓ డాక్టర్​ అల్లెం అప్పయ్య చెప్పారు. వీరిలో కుక్కలు, కోతులు కరిచినవారు 42 మంది, తేలు కాటేసినవారు 778 మంది, పాము కాటుకు గురైన వారు ఒకరు ఉన్నారన్నారు. ఎక్కువగా జ్వరం, ప్రమాదాల్లో గాయపడినవారు వస్తున్నారన్నారు. మెయిన్​ హాస్పిటల్​లో 30 బెడ్లు ఏర్పాటు చేయగా, 3,788 మందికి ట్రీట్​మెంట్​చేశామన్నారు. 9 మందిని వరంగల్​కు రెఫర్​ చేశామని చెప్పారు. 

అల్లాను ప్రార్థిస్తం..అమ్మను మొక్కుతం 

మేడారంలో తల్లులను ఓ ముస్లిం ఫ్యామిలీ ముప్పై ఏండ్లుగా దర్శించుకుంటోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన జానుబీకి వరుసగా ముగ్గురు కొడుకులు పుట్టారు. తర్వాతి కాన్పులో అయినా తనకు బిడ్డ కలగాలని 30 ఏండ్ల కింద సమ్మక్క తల్లిని మొక్కింది. కోరిక నెరవేరడంతో అప్పటి నుంచి ఫ్యామిలీతో కలిసి రెండేండ్లకోసారి జాతరకు వస్తోంది. ప్రతిసారి మూడు రోజులు ఇక్కడే ఉండి మొక్కులు చెల్లించుకుంటున్నానని జానుబీ చెప్పింది.

కాటకలిసినోల్లు నాలుగు వేల మంది

మేడారం జాతర షురువైనప్పటి నుంచి గురువారం వరకు నాలుగు వేల మంది తప్పిపోయిండ్లు. జాతరలో మిస్సయిన వారిని కుటుంబసభ్యులతో కలిపేందుకు ఆరు క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇక్కడ మూడు షిఫ్టులుగా144 మంది స్టాఫ్​, పన్నెండు మంది స్పెషల్ ఆఫీసర్లు డ్యూటీ చేస్తుండగా జోనల్ ఆఫీసర్ పర్యవేక్షిస్తున్నారు. రోజుకు సగటున పన్నెండు వందల మంది తప్పిపోతున్నారని 3 బీ క్యాంపు జోనల్ ఆఫీసర్ కన్నాయిగూడెం తహసీల్దార్ వీరాస్వామి తెలిపారు. తప్పిపోయిన పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి బుజ్జగిస్తున్నారు. క్యాంపుల్లోని మైకుల్లో  ‘మమ్మీ..డాడీ ఎక్కడున్నరే..నేను తప్పిపోయినోల్ల క్యాంపు కాడున్న. తొందరగా రార్రి... నాకు భయమైతాంది’ ...అంటూ పిల్లలు, తమ్ముడా .., కొడుకా..   అంటూ మరికొందరు తమ వారిని పిలుస్తున్నారు.  

90 ఎంఎల్ పోస్తేనే జడ్తా !

జాతరలో మేకలు, గొర్రెలను బలిచ్చే ముందు వాటికి స్నానం చేయించి, నోట్లో నీళ్లు, లిక్కర్​పోసి జడ్తా ఇవ్వాలని ఎదురుచూస్తారు భక్తులు. జడ్తా ఇవ్వలేదంటే ఏదో లోపం జరిగిందని భావిస్తారు. ‘తల్లీ నీకు అన్నీ జేసినం. ఏదన్నా తక్కువైతే జర్ర సూడు’ అని మల్లా ట్రై చేస్తరు. ఇట్లాగే జంపన్నవాగులో గురువారం ఓ కుటుంబం మేకపై నీళ్లు చల్లినా జడ్త ఇయ్యకపోవడంతో నోట్లో విస్కీ పోశారు. జడ్త ఇవ్వడంతో సంబుర పడి తల్లికి బలిచ్చారు.

రాత్రి పూట జిల్ ​జిల్ ​జిగ!

మేడారం నైట్​టైం కరెంట్​ లైట్ల ధగధగలతో అత్యద్భుతంగా కనిపిస్తోంది. అక్కడక్కడా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్​ లైటింగ్స్​ కళ్లు జిగేల్​మనేలా చేస్తున్నాయి. వెన్నెల వెలుగులు వీటికి జత కలవడంతో జాతర మరింత అందంగా మారింది.