మేడారం జాతరకు భారీగా తరలివస్తున్నభక్తులు

మేడారం మహాజాతర ప్రారంభమైంది. జన జాతరకు భక్తులు.. భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే మేడారం చుట్టుపక్కల జన సంద్రమైంది. దారులన్నీ మేడారం వైపే అన్నట్లు.. తెలంగాణవ్యాప్తంగా జనం తరలివెళ్తున్నారు. వన దేవతల మొక్కులు తీర్చుకునేందుకు, నిలువెత్తు బంగారం సమర్పించుకునేందుకు, చీరె, సారెలు అమ్మలకు ఇచ్చేందుకు.. దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు.

మేడారం జనజాతరలో ఇవాళ తొలిఘట్టం ఆవిష్కృతం కానుంది. జాతరలో సారలమ్మ గద్దెల పైకి రావడం తొలి ఘట్టం. కన్నెపల్లిలోని సారలమ్మ గుడి నుంచి అమ్మ ప్రతిరూపమైన పసుపు, కుంకుమ మేడారానికి తీసుకొస్తారు. ముందు మేడారంలోని సమ్మక్క గుడి దగ్గర పగిడిద్దరాజు, సమ్మక్క పెళ్లి జరుగుతుంది. తర్వాత సారలమ్మ గద్దెపై కొలువు దీరుతుంది. పూనుగొండ్లలో పగిడిద్దరాజు, కొండాయిలో గోవిందరాజులు కొలువై ఉన్నారు. వీళ్లిద్దరినీ ఇవాళే గద్దెకు తీసుకొస్తారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పొనుగండ్ల గ్రామం నుంచి ఇప్పటికే మేడారం బయుల్దేరాడు పగిడిద్దరాజు. పెనుక వంశీయులు పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు చేసి పగిడిద్దరాజును తీసుకుని ఊరేగింపుగా వస్తున్నారు. దాదాపు 80 కిలోమీటర్ల దూరం అడవిలో నడుస్తూ పగిడిద్దరాజుతో మేడారానికి చేరుకోనున్నారు ఆదివాసీలు. ఇవాళ గద్దెల మీదకు చేరుకోనున్నాడు పగిడిద్దరాజు.

రెండోరోజు చిలుకుల గుట్టలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకొచ్చి మేడారంలోని గద్దె మీద ప్రతిష్టిస్తారు. ములుగు జిల్లా ఎస్పీ గాల్లోకి 3 రౌండ్లు పేల్చి అమ్మకు స్వాగతం పలుకుతారు. అమ్మవారిని తీసుకొచ్చే దారి పొడవునా భక్తులు ముగ్గులు వేస్తారు. ఆ సమయంలో భక్తులు డప్పు చప్పుళ్లతో పూనకాలతో ఊగిపోతారు. మేడారం మహా జాతరలో ఇదే ప్రధాన ఘట్టం. సమ్మక్కను తీసుకొస్తున్న పూజారులను తాకేందుకు.. అమ్మకు స్వాగతం పలికేందుకు దారిపొడవునా.. ఇసుకేస్తే రాలనంతగా భక్తులుంటారు. మూడో రోజు అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువుదీరి భక్తులను దర్శనమిస్తారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమలు , చీర , సారె, నూనె కలిపిన ఒడిబియ్యం, బంగారంగా పిలుచుకొనే బెల్లాన్ని సమర్పిస్తారు. నాలుగోరోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలందరినీ తిరిగి అడవికి తీసుకెళ్తారు పూజారులు. వేడుక మొత్తం వంశపారంపర్యంగా వస్తున్న గిరిజన పూజారులే చేయడం ఆనవాయితీ. 

తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర నుంచి గోండులు, కోయలు, లంబాడాలు, మధ్యప్రదేశ్ నుంచి బిల్లులు, రత్తిసాగర్ గోండులు, ఒడిశా నుంచి సవర ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇంకా లక్షల మంది గిరిజనేతరులు మేడారం బాట పట్టారు. గ్రామాల నుంచి వారం కింద మొదలైన ఎడ్ల బండ్లు వన దేవతల సన్నిధికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే 10 లక్షల మంది మేడారం వచ్చి గుడారాలు వేసుకొని ఉన్నారు. జాతరకు కోటి 20 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సోమవారం వరకే అరకోటి మంది భక్తులు వనదేవతలను దర్శించుకొని వెళ్లారని చెబుతున్నారు అధికారులు. జంపన్న వాగులో స్నానాలు, తలనీలాల సమర్పణ, ఎదుర్కోళ్లు, మొక్కులు చెల్లించడం, లక్ష్మీదేవరలు, శివసత్తుల పూనకాలు, ఒడిబియ్యం సమర్పణ, బెల్లం బంగారంతో తులాభారం, కోయ దొరల భవిష్యవాణి, ఆటపాటలతో మేడారం మహా జాతర కోలాహలంగా మారింది. 

10 వేల పోలీసులతో బందోబస్తు పెట్టారు. డీజీ నాగిరెడ్డి శాంతిభద్రతలను పర్యవేక్షించనున్నారు. మొత్తం 30 వేల మంది అధికారులు, సిబ్బంది మేడారం విధుల్లో ఉన్నారు. జాతర కోసం ఆర్టీసీ 3వేల 845 బస్సులను నడుపుతోంది. వైద్యశాఖ 35 శిబిరాలను, తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటు చేసింది. జాతర కోసం 4 ప్రాంతాల నుంచి మేడారానికి హెలికాప్టర్లు నడుపుతుంది టూరిజం శాఖ.