ఇవాళ గద్దెపైకి సారలమ్మ.. జనసంద్రమైన మేడారం

ఇవాళ గద్దెపైకి సారలమ్మ.. జనసంద్రమైన మేడారం
  • పూనుగొండ్ల నుంచి బైలెల్లిన పగిడిద్దరాజు 
  • కొండాయి నుంచి రానున్న గోవిందరాజులు
  • రేపు గద్దెపై కొలువుదీరనున్న సమ్మక్క
  • ఇప్పటికే 15 లక్షల మందికి పైగా భక్తుల రాక 
  • ఎల్లుండి వనదేవతలను దర్శించుకోనున్న
  • గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి

మేడారం( జయశంకర్‌‌ భూపాలపల్లి), వెలుగు: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు వేళయింది. సమ్మక్క, సారలమ్మ మహా జాతర కోసం మేడారం ముస్తాబైంది. బుధవారం సారలమ్మ రాకతో మహాజాతర ప్రారంభం కానుంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు బుధవారం ఒకేరోజు గద్దెల పైకి చేరుకుంటారు. 

ఇప్పటికే పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారం బయల్దేరారు. బుధవారం మధ్యాహ్నం వరకు మేడారం చేరుకుంటారు. మంగళవారం జంపన్న వాగులో పూజలు కూడా పూర్తి చేశారు. కాగా, మేడారంలో ఎక్కడ చూసినా భక్తుల కోలాహలమే కనిపిస్తున్నది. ఇప్పటికే 15 లక్షల మందికి పైగా భక్తులు చేరుకున్నారని ఆఫీసర్లు చెబుతున్నారు. బుధవారం నుంచి ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. భక్తులు బస చేయడానికి సమ్మక్క, సారలమ్మ పేర్లతో సర్కార్ భవన్లు నిర్మించారు. ఇవి కాకుండా హరిత కాకతీయ హోటల్‌‌‌‌, ప్రైవేట్‌‌‌‌ హోటల్స్‌‌‌‌ ఉన్నాయి. మేడారం, ఊరట్టం, కొండాయి, నార్లాపూర్‌‌‌‌, రెడ్డి గూడెం తదితర ప్రాంతాల్లో కుటుంబంతో సహా భక్తులు బస చేయడానికి ప్రైవేట్‌‌‌‌ రూమ్స్‌‌‌‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. 

సారలమ్మ రాకతో మొదలు.. 

మాఘశుద్ధ పౌర్ణమి రోజైన బుధవారం సారలమ్మ గద్దెపైకి రావడంతో మేడారం మహాజాతర ప్రారంభమవుతుంది. గురువారం సమ్మక్క తల్లి వస్తుంది. గోవిందరాజు, పగిడిద్దరాజులు కూడా బుధవారమే తమ గద్దెలపై కొలువుదీరుతారు. బుధవారం సాయంత్రం కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం వడ్డెలు(పూజారులు) ప్రత్యేక పూజలు చేస్తారు. సారలమ్మ పూజారి కాక సారయ్య మొంటె(వెదురుబుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలను భరిణె రూపంలో తీసుకుని కాలినడకన మేడారానికి బయలుదేరుతారు. ఈ సమయంలో పూజారిని తాకడానికి చాలామంది ప్రయత్నిస్తారు. పిల్లల కోసం తపించే మహిళలు వరం పడుతారు. అమ్మవారిని తీసుకొచ్చే దారి పొడవునా రోడ్డుపై పడుకుంటారు. పూజారులు వారి పైనుంచే నడుచుకుంటూ వస్తారు. మార్గమధ్యలో జంపన్నవాగు దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి వాగు దాటి వెళ్తారు. అక్కడ్నుంచి మేడారంలోని సమ్మక్క ఆలయానికి చేరుకుంటారు. అక్కడ పగిడిద్దరాజు-, సమ్మక్క పెండ్లి కనులపండువగా జరుగుతుంది. తర్వాత సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను అర్ధరాత్రి మేడారం గద్దెలపైకి చేరుస్తారు. 

పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు.. 

సమ్మక్క భర్త పగిడిద్దరాజు మహబూబాబాద్‌‌‌‌ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్ల గ్రామంలో కొలువుదీరారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని కన్నాయిగూడెం మండలంలోని కొండాయి గ్రామంలో గోవిందరాజులు కొలువై ఉన్నారు. గిరిజన పూజారులు వీళ్లిద్దరిని కూడా బుధవారమే గద్దెకు తీసుకొస్తారు. పూనుగొండ్లలో మంగళవారమే గిరిజన పూజారులు పూజలు చేసి కాలిబాటన మేడారం బయల్దేరారు. 60 కిలోమీటర్ల దూరం అటవీ మార్గాన నడుచుకుంటూ వస్తున్నారు. మంగళవారం రాత్రి లక్ష్మీపురంలో నిద్రించి తెల్లవారుజామునే బయల్దేరుతారు. కొండాయిలో గోవిందరాజు గుడి పూజారులు బుధవారం ఉదయం పూజలు చేసి గద్దెపై ప్రతిష్ఠించడానికి ఆయనను వెదురు బుట్టలో తీసుకొని బయల్దేరుతారు. పగిడిద్దరాజు, గోవిందరాజులను తీసుకొచ్చే పూజారులు పగిడెలను తీసుకొని మేడారం గద్దెలకు చేరుకుంటారు. 

నాలుగో రోజు వనంలోకి.. 

మహాజాతరలో మూడో రోజైన శుక్రవారం అమ్మవార్లు గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు. మేడారం వచ్చిన భక్తులంతా ఎత్తుబెల్లం, పసుపు కుంకుమ, సారె చీరెలు సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. నాలుగో రోజైన శనివారం సాయంత్రం గిరిజన పూజారులు గద్దెలపై ఉన్న వనదేవతలకు ఆవాహన పలికి అందరిని తిరిగి యథాస్థానాలకు తరలిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ వేడుక నిర్వహిస్తారు. దీంతో మహాజాతర ముగుస్తుంది.

23న మేడారానికి గవర్నర్, సీఎం  

అమ్మవార్లను దర్శించుకోవడానికి 23న గవర్నర్‌‌‌‌ తమిళిసై, సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి రానున్నారు. 2022లో పీసీసీ ప్రెసిడెంట్‌‌‌‌ హోదాలో రేవంత్‌‌‌‌.. వనదేవతలను దర్శించుకున్నారు. రెండేండ్లు తిరిగేసరికి ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నారు. 2022లో జాతర జరిగినప్పుడు అప్పటి సీఎం కేసీఆర్‌‌‌‌ మేడారం రాలేదు. ఆ టైమ్ లో గవర్నర్‌‌ తమిళిసై వచ్చి మొక్కులు చెల్లించారు. ఈసారి గవర్నర్‌‌, సీఎం ‌‌ఒకేరోజు వస్తుండడంతో ఆఫీసర్లు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.  

గిరిజనులే పూజారులు
 
వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఇక్కడి ప్రత్యేకత. వేద మంత్రోచ్ఛారణలు లేకుండా, విగ్రహారాధన చేయకుండా, ఏ మత ఆచారాలు పాటించకుండా కేవలం కోయ పూజారుల(వడ్డెలు) ఆధ్వర్యంలో కోయ గిరిజన పద్ధతిలో భక్తులు మొక్కులు చెల్లిస్తారు. జాతర ఆదాయంలో కోయ పూజారులకు మూడో వంతు వాటా ఇస్తున్నారు.  

రెండో రోజు సమ్మక్క రాక.. 

మేడారం మహాజాతర ప్రారంభ సూచికగా బుధవారం ఉదయం గిరిజన పూజారులు కంకవనం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. తర్వాత సారలమ్మ రాకను పురస్కరించుకుని గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. సమ్మక్క గుడి నుంచి అడెరాలు(కుండలను) తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. మేడారం మహాజాతరలో గురువారం అపూర్వ ఘట్టం సాక్షాత్కరిస్తుంది. గిరిజన పూజారులు, కోయదొరలు చిలుకల గుట్టలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకొచ్చి మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ మూడు రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకొస్తున్నట్టుగా సంకేతాలు పంపిస్తారు. దీంతో మేడారం ప్రాంతమంతా భక్తిభావంతో పులకించిపోతుంది. అమ్మవారిని తీసుకొచ్చే దారి పొడవునా భక్తులు రంగురంగులతో ముగ్గులు వేస్తారు. ఆ సమయంలో భక్తులు పూనకంతో ఊగి పోతారు. రాత్రివేళ అమ్మవారిని గద్దెపైన ప్రతిష్టిస్తారు.