ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ల సమీక్షలో
ఏటూరునాగారం, వెలుగు : మేడారం మహా జాతర పనులను స్పీడప్చేయాలని మంత్రి సీతక్క ట్రైబల్వెల్ఫేర్ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్లోని డీఎస్ఎస్భవన్లో ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టినా జెడ్ చొంగ్తుతోపాటు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే మేడారం జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తెకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. జాతర తర్వాత కూడా చేసిన పనులు జనానికి ఉపయోగపడాలన్నారు. మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా ఇవ్వాలని కోరుతూ మరోసారి ప్రతిపాదనలు పంపిద్దామని చెప్పారు.
రాష్ట్ర బడ్జెట్ కు కేంద్రం నిధులు తోడైతే మరింత ఘనంగా నిర్వహించుకోవచ్చన్నారు. వచ్చే వారం ఏటూరునాగారంలోని ఐటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించాలని సూచించారు. గిరిజన సంక్షేమ శాఖ తనకు తల్లి వంటిదని, ఈ శాఖలోని ఉద్యోగులు ఎప్పుడైనా తనను కలవచ్చని, సమస్యలు చెప్పుకోవచ్చని భరోసా ఇచ్చారు. అనంతరం సీతక్కను ఆఫీసర్లు శాలువాతో సత్కరించారు. సమీక్షలో ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ అంకిత్, సహాయ కార్యదర్శి సర్వేశ్వర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శంకర్, ఐటీడీఏ ఈఈ హేమలత తదితరులు పాల్గొన్నారు.