- దారికి అడ్డుగా ఉన్నాయని ఆదేశాలిచ్చిన అడిషనల్ కలెక్టర్
- ఆఫీసర్ కారు ముందు బైఠాయించిన వ్యాపారులు
- పోలీసుల జోక్యంతో విరమణ
జయశంకర్ భూపాలపల్లి/తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల సమీపంలో దారికి అడ్డంగా ఉన్నాయని శుక్రవారం రాత్రి ఆఫీసర్లు షాప్‌లను కూల్చివేయించడంతో ఉద్రిక్తత నెలకొంది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారంటూ యజమానులు అడిషనల్ కలెక్టర్‌ను అడ్డుకున్నారు. ఆమె వాహనానికి అడ్డంగా కూర్చొని రాస్తారోకో చేశారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు మేడారం మహాజాతర జరగనున్నది. ఇప్పటికే రోజూ అధిక సంఖ్యలో భక్తులు వస్తుండడంతో ములుగు అడిషనల్ కలెక్టర్ శ్రీజ ఆధ్వర్యంలో మేడారం గద్దెలకు దగ్గరగా ఉన్న ఏరియాలో రోడ్డుపై ట్రాఫిక్ కు అడ్డుగా ఉన్న షాప్‌లను తొలగించేందుకు ఆదేశాలిచ్చారు.
శుక్రవారం అర్ధరాత్రి జేసీబీలతో రెండు, మూడు షాపులను కూల్చి మిగతా వాటిని కూల్చేందుకు రాగా స్థానిక షాప్ యజమానులు తిరగబడ్డారు. నోటీసు ఇవ్వకుండా కూల్చడమేంటని అడిషనల్ కలెక్టర్‌ను ప్రశ్నించారు. గత వర్షాకాలంలో వరదలు వచ్చి షాపులు కొట్టుకుపోయాయని, దీంతో తీవ్రంగా నష్టపోయామన్నారు. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ పేరుతో దుకాణాలు తీసివేస్తే ఎలా బతకాలంటూ నిలదీశారు. ‘సర్కారు భూమిలో షెడ్లు ఎలా వేసుకుంటారు ’ అని అడిషనల్ కలెక్టర్ ప్రశ్నించారు. భక్తులకు ఇబ్బందులు కలగకూడదనే ఇలా చేస్తున్నామని సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు.
అయినా వినలేదు. ప్రత్యామ్నాయం చూపించేంత వరకు షాప్‌లు కూల్చవద్దని నినాదాలు చేశారు. ఆమె కారుకు అడ్డంగా కూర్చొని రాస్తారోకో చేశారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఏటూరునాగారం అడిషనల్ ఎస్పీ సంకీర్త్ జోక్యం చేసుకొని వ్యాపారులతో మాట్లాడారు. మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని సర్ధి చెప్పారు. దీంతో ఆఫీసర్లు షెడ్లు కూల్చివేత ఆపెయ్యడంతో వ్యాపారులు రాస్తారోకో విరమించారు.