రూ. 12 కోట్లతో మేడారం జాతర పనులు

హనుమకొండ :   మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని,  రూ. 12 కోట్ల నిధులతో మేడారం జాతర పనులను ప్రారంభిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.  ఫిబ్రవరి నాటికి జాతర పనులను పూర్తి చేస్తామన్నారు.   వరంగల్ లో రూ.4 కోట్లతో నిర్మించిన ధార్మిక భవన్ ను మంత్రులు  ,  ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్ లతో కలిసి ఇంద్రకరణ్​ రెడ్డి  ఇవాళ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకతీయులు నిర్మించిన శివాలయాలను పునర్నిర్మిస్తున్నామని  చెప్పారు.  బీఆర్ఎస్  ప్రభుత్వం లో వరంగల్ నగరంలోని అనేక దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు..  రామప్పకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా కృషి చేశామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రూ. 100 కోట్లతో వల్మిడి ఆలయాన్ని అభివృద్ధి చేశామన్నారు. 

కాకతీయులు నిర్మించిన శివాలయాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేదని,  బీఆర్ఎస్  ప్రభుత్వం వాటిని  అభివృద్ధి చేస్తోందని చెప్పారు. . కొంతమంది హిందూ పేరుతో రాజకీయం చేస్తున్నారని, అసలైన  హిందువు  ముఖ్యమంత్రి కేసీఆర్ అని ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు.