బండెన్క బండి.. బస్సెన్క బస్సు.. కారెన్క కారు..అన్నీ మేడారం బాట వడ్తున్నయ్. బుధవారం గద్దెకు సారలమ్మ రాకతో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మొదలుకానుండగా, మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ కళకళలాడుతున్నాయి. ఎడ్లబండ్లపై వచ్చిన గిరిజనులు నాలుగురోజులు ఇక్కడే ఉండేలా గుడారాలు వేస్తుండడంతో కుగ్రామం కాస్తా జనగుడారమైంది. కోటి మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశముండడంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.105 కోట్లతో ఏర్పాట్లు పూర్తి చేసింది. జాతర ప్రాంతాన్ని 8 జోన్లు 32 సెక్టార్లుగా విభజించిన అధికారులు 35 వేల మంది ఉద్యోగులకు విధులు కేటాయించారు. పోలీస్ శాఖ నుంచే 14వేల మంది డ్యూటీలో నిమగ్నమయ్యారు. ఆర్టీసీ, రైల్వే సేవలు, హనుమకొండ నుంచి హెలీక్యాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
– మేడారం, (జయశంకర్ భూపాలపల్లి), వెలుగు
రేపటి నుంచే మేడారం మహాజాతర మొదలుకాబోతోంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. మౌలిక వసతులు, నిర్వహణ కోసం రూ.105 కోట్లు కేటాయించింది. డిసెంబర్లో కొత్త సర్కారు ఏర్పడిన వెంటనే రూ.75 కోట్లను రిలీజ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆర్డర్స్ ఇచ్చారు. తర్వాత మరో రూ.30 కోట్లు కేటాయించారు. రూ.70 కోట్లతో ఇంజినీరింగ్ వర్క్స్, రూ.35 కోట్లతో నాన్ ఇంజినీరింగ్ పనులు చేపట్టారు. జనవరిలో పనులు మొదలుపెట్టి సోమవారం నాటికి అన్నీ పూర్తి చేశారు. ఆర్‌అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ల పనులన్నీ పూర్తయ్యాయి. ఆర్‌డబ్ల్యుఎస్ ఆధ్వర్యంలో తాగునీటి వసతి కల్పించారు. 200కు పైగా బోర్‌వెల్స్ వేశారు. శాశ్వత, తాత్కాలిక టాయిలెట్స్ నిర్మించారు.
డ్యూటీలో 35 వేల మందికి పైగా ఉద్యోగులు
వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 35 వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు మేడారం డ్యూటీల్లో చేరారు. జాతర ప్రాంతాన్ని 8 జోన్లు, 32 సెక్టార్లుగా విభజించారు. పోలీస్, పంచాయతీరాజ్ శాఖ, ఆర్టీసీ శాఖల తరపున ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు డిప్యూటేషన్‌పై పనిచేయడానికి వచ్చారు. ఒక్క పోలీస్‌శాఖ తరపునే 14 వేల మంది డ్యూటీల్లో ఉన్నారు. దేవాదాయ, టూరిజం, రెవెన్యూ, వైద్యారోగ్య, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ శాఖల తరపున వేలల్లో ఉద్యోగులు సేవలందించడానికి రెడీ అయ్యారు. రాష్ట్ర, జిల్లాస్థాయి ఆఫీసర్లతో పాటు ములుగు కలెక్టర్, ఎస్పీ తదితర ఉన్నతోద్యోగులంతా వారం పాటు మేడారం మహాజాతర జరిగే ప్రాంతంలోనే డ్యూటీలు చేయబోతున్నారు.
మేడారానికి మహాలక్ష్మిత స్కీం అమలు
మేడారం మహాజాతరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మీ స్కీం అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మక్క–సారలమ్మలను దర్శించుకోవడానికి వచ్చే మహిళలు, బాలికలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఇందుకోసం 6 వేల బస్సులను నడుపుతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆర్టీసీ ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2.25 కోట్లు ఖర్చు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే భక్తులు గద్దెల దగ్గరి వరకు వచ్చేలా అనుమతిచ్చారు. ఆర్టీసీ బస్టాప్‌కు కేవలం అర కిలోమీటర్ దూరంలోనే గద్దెలు ఉంటాయి. ఫిబ్రవరి 18 నుంచి 25వ తేదీ వరకు ఆర్టీసీ బస్సులు నడుపుతామని మంత్రి పొన్నం ప్రకటించారు. 2022 జాతరలో 18 లక్షల మంది బస్సుల్లో మేడారం వస్తే ఈ సారి 40 లక్షల మందిని మేడారం తరలించనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఆయన నేతృత్వంలో ఇప్పటికే మేడారంలోని 50 ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. 47 క్యూలైన్లు నిర్మించారు. 70 సీసీ కెమెరాల పర్యవేక్షణలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తామని వరంగల్ ఆర్‌ఎం శ్రీలత ప్రకటించారు.
మేడారంలో 50 పడకల దవాఖాన
జాతరలో భక్తులు అనారోగ్యానికి గురైతే చికిత్స అందించడానికి స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో 50 బెడ్స్ దవాఖాన ఏర్పాటు చేశారు. 30 చోట్ల ఉచిత హెల్త్‌క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు. భక్తులకు 24 గంట ల పాటు వైద్య సౌకర్యం అందించనున్నారు. అన్ని చోట్లా కలిపి 150 మంది స్పెషలిస్టు డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. జాతర పరిసర ప్రాంతాల్లో 4 బెడ్స్‌తో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో చోట ముగ్గురు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. డాక్టర్లు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్ సిబ్బంది కలిపి రెండు వేల మందికి పైగా జాతరలో డ్యూటీలు నిర్వహిస్తారని డీఎంఅండ్‌హెచ్‌వో అప్పయ్య ప్రకటించారు. అత్యవసరంగా రోగులను తరలించేందుకు 108 అంబులెన్సులు 15 అందుబాటులో ఉంచారు. అలాగే టెంపరరీ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేశారు.
జాతర చుట్టూరా తాగునీటి సరఫరా
మహాజాతరలో పాల్గొనడానికి వచ్చే భక్తులంతా 20 కిలోమీటర్ల పరిధిలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. వీరికి స్వచ్ఛమైన తాగునీరందించేందుకు రూ.4.21 కోట్లతో పనులు పూర్తి చేశారు. ఇప్పటికే నిర్మించిన మూడు వాటర్‌ట్యాంక్‌లను వినియోగంలోకి తీసుకొచ్చారు. ఊరట్టం దగ్గర 2 లక్షలు, జంపన్నవాగు సమీపంలో 4 లక్షలు, జంపన్నవాగు ఇవతల 2 లక్షల లీటర్ల నీటిని నిల్వచేసే వాటర్‌ట్యాంక్‌లున్నాయి. వీటితో పాటు జాతర చుట్టుపక్కల ప్రాంతాల్లో 50కి పైగా మినీ వాటర్‌ట్యాంక్‌లున్నాయి. భక్తులు నివాసముండే ప్రతిచోటా శుద్ది చేసిన తాగునీరందేలా చర్యలు తీసుకున్నారు. జాతర కోర్ ఏరియాలోని 10 ప్రాంతాల్లో 5 వేల వరకు బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్(బీవోటీ)లను ఏర్పాటు చేశారు. భక్తులు నీళ్లు పట్టుకునే విధంగా వీటిని నిర్మించారు. కొత్తగా 200కు పైగా కొత్త బోర్‌వెల్స్ వేశారు.
బీటీ, అంతర్గత రోడ్ల నిర్మాణం
జాతర కోసం ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఐటీడీఏ ఇంజినీరింగ్ శాఖల తరపున బీటీ, సీసీ రోడ్లు వేశారు. మేడారానికి వచ్చే అన్ని రోడ్లు రిపేర్లు చేశారు. ఇరుకుగా ఉన్న మోరీలను వెడల్పు చేశారు.
20 వేల మంది నిద్రించడానికి షెడ్లు
భక్తులు ఇంతకుముందు ఉండడానికి గదులు లేక ఎవరికి వారే కవర్లతో షెడ్లు నిర్మించుకొని ఒకటి, రెండు రోజులు ఉండి అమ్మవార్లకు మొక్కులు సమర్పించి వెళ్లిపోయేవారు. జాతరకొచ్చే భక్తుల్లో సుమారు 20 వేల మంది ఉండడానికి, రాత్రివేళల్లో నిద్రించడానికి వీలుగా 5 షెడ్లను ఇది వరకే నిర్మించారు. వీటితో పాటు కొత్తగా మరో రెండు నిర్మించారు. ఇవన్నీ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఈ షెడ్ల వద్ద ఉచిత మూత్రశాలలు, మరుగుదొడ్ల వసతి సౌకర్యం కల్పించారు. ఒక్కో షెడ్డు దగ్గర నలుగురు చొప్పున సిబ్బందిని నియమించి భక్తులకు సేవలందిస్తున్నారు. జాతర చుట్టూరా భక్తుల సౌకర్యం కోసం ఆర్‌డబ్ల్యూఎస్ 5 వేలకు పైగా తాత్కాలిక మరుగుదొడ్లను నిర్మించింది. 20 ప్రాంతాల్లో వీటిని కట్టారు.
జాతరకు ప్రత్యేక రైళ్లు
జాతర కోసం ప్రత్యేక రైళ్లు నడిపించడానికి దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. సికింద్రాబాద్- ‒వరంగల్,- సిర్పూర్ కాగజ్ నగర్‒ -వరంగల్ - మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. ఫిబ్రవరి 20 నుంచి 25వ తేదీ వరకు ఈ రైళ్లు అప్ అండ్‌డౌన్ నడుస్తాయి. రైళ్ల ద్వారా 2.5 లక్షల మంది భక్తులు వచ్చే ఛాన్స్ ఉంది.
సీసీ కెమెరాల నిఘాలో..
మహాజాతర కోసం అటు ములుగు, ఏటూరునాగారం, ఇటు భూపాలపల్లి, కాటారం వరకు రోడ్ల వెంబడి సీసీ కెమెరాలు అమర్చారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే కంట్రోల్ రూమ్‌కు తెలిసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. గద్దెల వద్దనే 30కి పైగా కెమెరాలను ఫిక్స్ చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల సంరక్షణ కోసం పోలీస్ శాఖ 432 సీసీ కెమెరాలు, 5 డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తోంది. అలాగే జాతర కోర్ ఏరియా పరిధిలో సీసీ కెమెరాలను రెవెన్యూ శాఖ పర్యవేక్షిస్తోంది. ఐటీడీఏ గెస్ట్‌హౌజ్ దగ్గర రెవెన్యూ శాఖ, గద్దెలకు సమీపంలో పోలీస్ శాఖ కంట్రోల్ రూమ్‌లు ప్రారంభమయ్యాయి. అక్కడే భారీ ఎల్‌సీడీ తెరల ద్వారా జాతర పర్యవేక్షణ చేస్తున్నారు.
కిక్కిరిసిపోతున్న మేడారం
మేడారానికి ఇప్పటికే ఐదు నుంచి ఆరు లక్షల మంది భక్తులు వచ్చి గుడారాలు వేసుకున్నారు. గడిచిన మూడు నెలల్లో 50 లక్షల మందికి పైగా భక్తులు మేడారం వచ్చి ముందస్తు మొక్కులు చెల్లించుకుని వెళ్లిపోయారు. అయినా అమ్మవార్లు గద్దెకు వచ్చే సందర్భాన్ని కనులారా వీక్షించడానికి కుటుంబసభ్యులతో కలిసి లక్షల్లో భక్తులు తరలివస్తూనే ఉన్నారు. మహాజాతర ప్రారంభానికి ఒకే రోజు ఉండడంతో వాహనాల్లో వచ్చేవారు అప్పుడే చేరుకున్నారు. ఆలస్యమైతే వెహికిల్ పార్కింగ్ సమస్య వస్తుందని, గద్దెలకు చాలా దూరంలో ఉండాల్సి వస్తుందని ముందే మేడారం తరలివచ్చారు. తాడ్వాయి‒మేడారం, నార్లాపూర్‒మేడారం, ఊరట్టం‒మేడారం రూట్‌లో భక్తులు నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉండడానికి గుడారాలు వేసుకుంటున్నారు.
జంపన్నవాగు పొడవునా బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్
మేడారం వచ్చే భక్తులందరూ జంపన్నవాగులో స్నానం చేస్తారు. దీని కోసం ఇరిగేషన్ ఆఫీసర్లు 17న లక్నవరం నుంచి నీళ్లు వదిలిపెట్టారు. ఈ నీళ్లు సోమవారం మేడారం చేరుకోవడంతో జంపన్నవాగు కళకళలాడుతోంది. వాగులోకి దిగి స్నానాలు చేయలేని భక్తుల కోసం జంపన్నవాగుకు రెండు వైపులా 4 కి.మీ పొడవునా రూ.1.5 కోట్లతో ప్రభుత్వం బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ఏర్పాటు చేసింది. రూ.50 లక్షలతో జంపన్నవాగులో నిర్మించిన బావుల్లో పూడిక తీయించింది. నిత్యం మోటార్లు పనిచేయడానికి వీలుగా కరెంట్ కనెక్షన్లతో పాటు జనరేటర్లను సైతం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇవన్నీ వినియోగంలోకి వచ్చాయి. జంపన్నవాగు వద్ద మహిళలు బట్టలు మార్చుకోవడానికి 50కి పైగా తాత్కాలిక గదులను ఏర్పాటుచేశారు. దీనికోసం రూ.25 లక్షలు కేటాయించారు. ఈ సారి జంపన్నవాగు పొడవునా 4 కి.మీ దూరం..రెండు వైపులా ప్రతి 20 మీటర్లకొకటి చొప్పున ఏర్పాటుచేశారు. ఇప్పటికే జాతర కోసం వస్తున్న మహిళా భక్తులు వీటిని ఉపయోగిస్తున్నారు.