
- భక్తులకు ఇబ్బందులు కలుగకుండా శాశ్వత పనులు చేపట్టాలి
- అన్ని శాఖల ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్ చేసి ప్రపోజల్స్ రూపొందించాలి
- ములుగు కలెక్టరేట్‌లో మంత్రి సీతక్క రివ్యూ
ములుగు, వెలుగు : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.145 కోట్లు కేటాయించనుందని మంత్రి ధనసరి సీతక్క చెప్పారు. ఆఫీసర్లు కోఆర్డినేషన్‌తో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మేడారం మహాజాతర – 2026పై మంగళవారం ములుగు కలెక్టరేట్‌లో కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి అన్ని శాఖల ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో మాదిరిగా జాతరకు రెండు నెలల ముందు పనులు ప్రారంభించి హడావుడిగా చేయడం కాకుండా.. కనీసం ఆరు నెలల ముందుగానే పనులు ప్రారంభించి క్వాలిటీగా పూర్తి చేయాలని సూచించారు. వచ్చే ఏడాది మేడారం మహాజాతరతో పాటు, గోదావరి పుష్కరాలు జరగనున్నందున ఆయా శాఖల ఆఫీసర్లు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు.
గత మహాజాతర టైంలో మిగిలిన రూ. 50 కోట్లను వచ్చే జాతరకు వినియోగిస్తామని చెప్పారు. గద్దెల పరిసరాలను అందంగా తీర్చిదిద్దడమే కాకుండా, రూ. 5 కోట్లతో జంపన్న వాగు వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. భక్తులకు అవసరమయ్యే పనులను ముందుగానే గుర్తించి, అంచనాలు రూపొందించాలని సూచించారు. తాగునీరు, మరుగుదొడ్ల సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, జాతర పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. గత జాతర టైంలో ఏర్పడ్డ ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.
కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ గత జాతరలో పనిచేసిన ఆఫీసర్లు ఇప్పటికీ జిల్లాలోనే పనిచేస్తున్నారని, వారి అనుభవాలను పరిగణనలోకి తీసుకొని రానున్న జాతరను సక్సెస్ చేస్తామని చెప్పారు. రివ్యూలో ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్లు మహేందర్, సంపత్‌రావు, ములుగు డీఎస్పీ ఎన్.రవీందర్, ఆర్డీవో వెంకటేశ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్ పాల్గొన్నారు.
ఇంటర్‌లో ములుగు ఫస్ట్ రావడం అభినందనీయం
ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ములుగు జిల్లా రాష్ట్రస్థాయిలోనే ఫస్ట్‌ప్లేస్‌లో నిలవడం అభినందనీయం అని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా 80.12 శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల ఆఫీసర్లు, లెక్చరర్లను అభినందించారు.