హైదరాబాద్: దక్షిణ కుంభమేళగా ప్రసిద్ధ గాంచిన మేడారం మినీ జాతర తేదీలు ఖరారు అయ్యాయి. 2025, ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకూ మేడారం మినీ జాతర జరగనుంది. మేడారం మినీ జాతర ఏర్పాట్లపై మంత్రి సీతక్క అధికారులతో మంగళవారం (డిసెంబర్ 7) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్కు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, ఇతర అధికారులు, మేడారం పూజారులు హాజరయ్యారు. మేడారం మినీ జాతర తేదీ, ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఫిబ్రవరి 12 నుంచి 15వ వరకు మేడారం మినీ జాతర నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
పూర్వపు వరంగల్ జిల్లా ప్రస్తుత ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరగా ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. సమ్మక్క -సారక్కలను భక్తుల కష్టాలను కడతేర్చే వనదేవతలుగా, ఆపదలో ఉన్న వారిని ఆదుకొనే ఆపద్బాంధవులుగా గుర్తించి వనదేవతలుగా పూజిస్తున్నారు. కోయ గిరిజనుల ఉనికి కోసం పోరాడి వీర మరణం పొందిన సమ్మక్క, -సారలమ్మ జాతర ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్రుడు కాలం నుంచి కొనసాగుతున్నట్లు స్థలపురాణాలు చెప్తున్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. 1996లోనే ఈ జాతరను తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించారు. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే జాతర ఇదే.
ALSO READ | పనులన్నీ పెండింగే.. వారంలో ప్రారంభంకానున్న ఐలోని జాతర