- మేడారం, కన్నెపల్లి, బయ్యక్కపేటలో ప్రత్యేక పూజలు చేసిన పూజారులు
- మేడారంలో పెరిగిన భక్తుల రద్దీ
తాడ్వాయి, వెలుగు : మేడారం మినీ జాతరలో భాగంగా బుధవారం అమ్మవార్ల ఆలయాల్లో శుద్ధి పండుగలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేడారంతో పాటు బయ్యక్కపేట, కన్నేపల్లిలోని సమ్మక్క, సారలమ్మ ఆలయాలు, పూజాసామగ్రిని పూజారులు శుద్ధి చేశారు. పూజారుల ఇంటి ఆడబిడ్డలు ఆలయాల్లో ముగ్గులు వేసి, పసుపు, కుంకుమతో అమ్మవార్లను అలంకరించారు.
అనంతరం పూజారులు నైవేద్యాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. వచ్చే వారం మాఘా శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని మండ మెలిగే పండుగ నిర్వహిస్తామని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు తెలిపారు. పూజల్లో సమ్మక్క దేవత పూజారులు కొక్కెర కృష్ణయ్య, సిద్దబోయిన మునీందర్, సారలమ్మ పూజారి కాక సారయ్య, కాక కిరణ్, చందా పరమయ్య, రఘుపతి రావు, గోపాలరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అలాగే మేడారం పరిసర గ్రామాలైన పడిగాపురం, ఎల్బాక గ్రామాల్లో సమ్మక్క సోదరుడైన వనం పోతురాజు పండుగను నిర్వహించారు.
మేడారానికి తరలివచ్చిన భక్తులు
మేడారంలోని సమ్మక్క, సారలమ్మ ఆలయం బుధవారం భక్తులతో కిటకిటలాడింది. మరో వారం రోజుల్లో మినీ జాతర మొదలుకానుండడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముందుగా జంపన్న వాగులో స్నానాలు చేసిన అనంతరం అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకొని పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం సమర్పించారు. భక్తుల రద్దీ కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.