![మేడారంలో మినీ జాతర షురూ](https://static.v6velugu.com/uploads/2025/02/medaram-mini-jatara-start-in-mulugu-district-in-telangana_d6JmSMLzfX.jpg)
- ఘనంగా మండమెలిగే పండుగ
- గద్దెల వద్ద అలికి ముగ్గులు వేసిన ఆడబిడ్డలు
- దిష్టితోరణాలు.. ద్వార బంధనం కట్టిన పూజారులు
- డోలు వాయిద్యాలు, నైవేద్యాలతో ప్రత్యేక పూజలు
- గద్దెల వద్ద ఆదివాసీ పూజారుల జాగారం
- భారీగా తరలివచ్చిన భక్తులు.. బంగారంతో మొక్కులు
- ఈ నెల 15 వరకు కొనసాగనున్న జాతర
జయశంకర్ భూపాలపల్లి/తాడ్వాయి, వెలుగు: మేడారంలో సమ్మక్క, సారలమ్మ మినీ జాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తుల జయజయధ్వానాలు.. పూనకాలతో మేడారం మార్మోగింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఆదివాసీ పూజారులు మండమెలిగే పండుగను ఘనంగా ప్రారంభించారు. మహాజాతర ముగిసిన ఏడాది తర్వాత మళ్లీ వనదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో సమ్మక్క, సారలమ్మ గద్దెలు నిండిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.5.30 కోట్లతో భక్తులకు ఏర్పాట్లు చేసింది. కాగా, ఈ నెల 15 వరకు జాతర కొనసాగనున్నది.
బుధవారం ఉదయం నుంచే పూజలు స్టార్ట్
మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయాలను ఆదివాసీ పూజారులు శుద్ధి చేశారు. ఆడబిడ్డలంతా కలిసి ఆలయాలను నీటితో శుభ్రంగా కడిగి, పుట్టమట్టితో అలికి.. ముగ్గులతో అలంకరించారు. తల్లులు ధరించిన ఆయుధాలు, పూజా సామగ్రిని శుభ్రం చేశారు. దేవతామూర్తులు ధరించిన కత్తులు, మువ్వలు, గజ్జెలు, ఆడేడాలు, కుంకుమ భరిణెలను శుభ్రం చేసి.. పసుపు, కుంకుమలతో అందంగా అలంకరించారు. మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలోపూజలు నిర్వహించారు. ముందుగా సమ్మక్క గుడిని శుద్ధిచేశారు. కొక్కెర, సిద్ధబోయిన, దోబె, మల్లెల, చందా వంశీయులు ఉదయం నుంచి ఉపవాసాలు ఉండి.. పూజాసామగ్రిని శుభ్రం చేసుకున్నారు. పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, మంగళహారతులతో సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య ఆధ్వర్యంలో పూజారులంతా కుటుంబసమేతంగా పూజలు చేశారు.
అమ్మవార్లకు చలపయ్య మొక్కు
మేడారం మినీజాతరలో చలపయ్య మొక్కుకు చాలా ప్రత్యేకత ఉంటుంది. పూజారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి డోలు వాయిద్యాలు, సన్నాయి మేళాల నడుమ ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం మంగళహారతులతో ఊరేగింపుగా అమ్మవార్ల చెంతకు వచ్చారు. బుధవారం చలపయ్యగా పిలుచుకునే లేగదూడ మొక్కును చెల్లించారు. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, అమ్మవార్ల నామస్మరణతో గద్దెల ప్రాంగణమంతా మార్మోగింది. పూజారులు రాత్రి వేళల్లో జాగరణచేసి, విందు భోజనాలు చేశారు. బుధవారం ఉదయం భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు.. జంపన్నవాగులో స్నానాలు చేశారు. అమ్మవార్లను దర్శించుకొని తలనీలాలు, ఎత్తుబెల్లం సమర్పించుకున్నారు. కోడిపిల్లలు, యాట మొక్కుల అనంతరం మేడారం పరిసరాల్లో విందు భోజనాలు చేసి, వెనుదిరిగారు.
సారలమ్మ గుడిలో!
సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, కుటుంబ సభ్యులు ఆలయాన్ని శుద్ధిచేశారు. అనంతరం పూజాసామగ్రిని బయటకు తీసుకువచ్చి శుభ్రం చేశారు. పూజామందిరంలోని సారలమ్మ కొలువుదీరిన గద్దెకు అలుకుపూతలు చేసి, వస్త్రాలను సమర్పించారు. ప్రత్యేకంగా అలంకరించిన అనంతరం తొలి మొక్కులు చెల్లించుకున్నారు. దుష్టశక్తుల నుంచి గ్రామాన్ని రక్షించాలని కోరుతూ ద్వార బంధనాలు కట్టారు.