మేడారం సమ్మక్క పూజారి మృతి.. 

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో విషాదం జరిగింది. మహాజాతర సమయంలో చిలుకలగుట్ట నుంచి సమ్మక్క వనదేవతను తీసుకువచ్చే ప్రధాన పూజారుల్లో ఒకరైన సిద్దబోయిన లక్ష్మణ్  రావు (40) గురువారం ఉదయం అనారోగ్యంతో చనిపోయారు. లక్ష్మణ్  రావు కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. రోజురోజుకు  ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను బుధవారం వరంగల్ లోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

మృతుడికి భార్య సవిత, ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు. పూజారి మృతి విషయం తెలిసిన వెంటనే ములుగు ఎమ్మెల్యే సీతక్క మేడారం చేరుకొని ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అండగా ఉంటామని ఆయన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే తహసీల్దార్  తోట రవీందర్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధమైన జగ్గారావు, పూజారులు, ఎండోమెంట్ అధికారులు, ఎస్సై ఓంకార్ యాదవ్, పోలీసులు, స్థానికులు కూడా లక్ష్మణ్​ రావు మృతదేహానికి నివాళులర్పించారు.