మేడారానికి భక్తుల రాక .. మూడు రోజుల్లో మినీ మేడారం జాతర

మేడారానికి భక్తుల రాక .. మూడు రోజుల్లో మినీ మేడారం జాతర
  • తరలివస్తున్న భక్తజనం
  • ఆదివారం ఒక్కరోజే 30 వేల మంది భక్తుల రాక 

తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం, మేడారం  సమ్మక్క సారలమ్మ దేవతల మినీ మేడారం జాతరకు మూడు రోజుల్లో జరగనుంది. కాగా ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు వనదేవతల దర్శనానికి భారీగా తరలివచ్చారు. ముందుగా మేడారం చేరుకున్న భక్తులు జంపన్న వాగులో నల్లాల కింద  పుణ్యస్నానాలు ఆచరించారు.  అక్కడి నుండి దేవతల ప్రాంగణానికి చేరుకొని క్యూలైన్ల ద్వారా గద్దెల వద్దకు చేరుకొని పసుపు, కుంకుమ, పూలు,చీరసారే,  బంగారం (బెల్లం ) దేవతలకు సమర్పించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  

 బంధువులతో వనభోజనాలు చేశారు.  ఎండోమెంట్ అధికారులు క్యూలైన్లలో తాగునీరు, చలవ పందిళ్లు ఏర్పాటు చేశారు.  ట్రాఫిక్ జామ్ కాకుండా  పోలీసులు వాహనాలను శివరాం సాగర్ చెరువు వద్ద వీఐపీ రోడ్డు గుండా  దారి మళ్లించారు. గద్దెల వద్ద తొక్కిసలాట జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక్కరోజే 30 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారని ఎండోమెంట్ ఈవో రాజేంద్రన్ తెలిపారు. భక్తులు రాకతో మేడారం అంతా పండుగ వాతావరణం నెలకొంది.