మేడారం స్పెషల్ బస్సుల్లో ఒక్కరికి రూ.1000 పై మాటే

  • 70 నుంచి 80 శాతం పెంచిన ఆర్టీసీ
  • 3,845 స్పెషల్​ బస్సుల్లో ఇవే రేట్లు 
  • పేద భక్తులపై భారం

వరంగల్‍, వెలుగు: మేడారం జాతర స్పెషల్​ బస్సుల్లో ఆర్టీసీ చార్జీలను పెంచింది. నార్మల్​బస్సులతో పోలిస్తే టికెట్​రేట్లు 70 నుంచి 80 శాతం పెరగడంతో భక్తులపై తీవ్ర భారం పడనుంది. పెరిగిన రేట్ల కారణంగా పిల్లాజెల్లతో జాతరకు వచ్చే ఫ్యామిలీలకు బస్సు చార్జీలకే వేలకు వేలు కానున్నాయి. ఇటీవల సంక్రాంతి టైంలో ఏపీకి వేసిన స్పెషల్​బస్సుల్లోనూ టికెట్ రేట్లు పెంచని మేనేజ్​మెంట్​, పేద భక్తులు వెళ్లే మేడారం బస్సు చార్జీలు పెంచడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 16 నుంచి19 వరకు జరిగే మేడారం జాతర కోసం టీఎస్‍ ఆర్టీసీ స్టేట్​ వైడ్ గా​3,845 స్పెషల్​ బస్సులు నడపనుంది. ఇందులో వరంగల్‍ రీజియన్‍ పరిధిలోని తొమ్మిది డిపోల నుంచే 2,250 బస్సులు ఉన్నాయి. ప్రైవేటు వెహికిల్స్ తో పోలిస్తే ఆర్టీసీకి చెందిన బస్సుల్లో సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరకు వెళ్లే అవకాశం ఉండడంతో ప్రయాణికులు వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. 30 మంది ఉంటే ఇంటివరకు బస్సు పంపిస్తామంటుండడంతో ఈసారి ఆర్టీసీ బస్సులనే ఆశ్రయించే అవకాశం ఉంది. ఇవన్నీ బాగానే ఉన్నా.. సంక్రాంతి మాదిరి ఆక్యుపెన్సీ పెంచుకొని ఇన్‍కం రాబట్టుకోవాల్సి ఉండగా భక్తులపై భారం వేసి సంపాదించుకునే ఆలోచన చేసింది ఆర్టీసీ.

ఒక్కరికి రూ.1000 పై మాటే..
మేడారం జాతరకు పెరిగిన టికెట్​ రేట్ల ప్రకారం.. ఎక్స్​ప్రెస్ ​లో  పెద్దలకు హైదరాబాద్‍ దాని చుట్టుపక్కల నుంచి రూ.450, రూ.470 ఉండగా.. పిల్లలకు రూ.250 వసూలు చేయనున్నారు. డీలక్స్ అయితే  పెద్దలకు రూ.530, సూపర్‍ లగ్జరీ రూ.600, రాజధాని రూ.780, గరుడ ప్లస్‍ రూ.930 గా ఫిక్స్ చేశారు. ఈ లెక్కన హైదరాబాద్​ చుట్టుపక్కల నుంచి ఒక్క వ్యక్తికే రానుపోను కలిపి వెయ్యికి పైనే అవుతుండగా,  ఇంట్లో ఐదారుగురు కలిసి వెళ్తే  కేవలం బస్‍ చార్జీలకే రూ. 6 వేల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. వరంగల్‍ నుంచి నిన్నమొన్నటి వరకు పెద్దలకు రూ.125, పిల్లలకు రూ.65 వసూలు చేయగా.. ఇప్పుడు ఎక్స్​ప్రెస్‍ అయితే పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.110, గరుడ ప్లస్‍ అయితే పెద్దలకు రూ.390, పిల్లలకు రూ.300 వసూలు చేసేందుకు రెడీ అయ్యారు. అటు ఇటుగా ప్రైవేట్‍ వెహికల్స్ కూడా ఇవే రేట్లు వసూలు చేస్తున్నాయి. దీంతో ఇంట్లో నలుగురి కంటే ఎక్కువ ఉంటే పర్వైవేటును ఆశ్రయించినా ఆశ్చర్యపోనక్కరలేదు.