- ప్రమాదకరంగా మూలమలుపులు, రక్షణ లేని బ్రిడ్జిలు
- నత్తనడకన ఫోర్‌లేన్ విస్తరణ పనులు
- నామమాత్రపు చర్యలతోనే సరిపెడుతున్న ఆఫీసర్లు
హనుమకొండ, వెలుగు : వరంగల్ నగరం మీదుగా మేడారం వెళ్లే రోడ్లు డేంజర్ జోన్లను తలపిస్తున్నాయి. ఎన్‌హెచ్ 163, ఎన్‌హెచ్ 563పై ఉన్న మూలమలుపులు, ఇరుకు బ్రిడ్జిలు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. మరో వారం రోజుల్లో మేడారం జాతర ప్రారంభం కానుండడంతో ఈ రూట్లో వేలాది వెహికల్స్ రాకపోకలు సాగించే అవకాశం ఉంది. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన ఆఫీసర్లు నామమాత్రపు చర్యలతోనే సరిపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
వరంగల్ – కరీంనగర్ హైవేపై...
సిద్దిపేట, హుస్నాబాద్, హుజురాబాద్ వైపు నుంచి ఎల్కతుర్తి మీదుగా వచ్చే వాహనాలు వరంగల్ నగరంలోకి ఎంటరై వరంగల్ – కరీంనగర్ హైవే మీదుగా చింతగట్టు వరకు రావాల్సి ఉంటుంది. రూ.2,146 కోట్లతో గతేడాది చేపట్టిన కరీంనగర్ – వరంగల్ హైవే విస్తరణ పనులు ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి. అలాగే ఈ రూట్‌లో అనంతసాగర్, చింతగట్టు వద్ద ఉన్న ఎస్‌ఆర్‌ఎస్పీ కెనాల్ బ్రిడ్జిలు ప్రమాదకరంగా మారాయి.
అనంతసాగర్ బ్రిడ్జి వద్ద గతంలో పలు వాహనాలు ఢీకొట్టడం వల్ల రెయిలింగ్ ఓ వైపు కూలిపోయింది. అలాగే చింతగట్టు క్యాంప్ వద్ద ఉన్న బ్రిడ్జికి ఇరువైపులా రెయిలింగ్ దెబ్బతింది. దీంతో రెండు చోట్ల చిన్నపాటి రేకులను అడ్డుగా పెట్టి ఆఫీసర్లు చేతులు దులుపుకున్నారు. ఈ హైవేపై ఎల్కతుర్తి నుంచి హసన్‌పర్తి వరకు సుమారు 9 చోట్ల ప్రమాదకర మూలమలుపులు ఉన్నాయి.
మేడారం రూట్‌లోనూ...
హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ వైపు నుంచి వచ్చే వాహనాలు హైవే-163పై ఆరేపల్లి, దామెర, ఆత్మకూరు మీదుగా మేడారం వెళ్తుంటాయి. ఈ రూట్‌లో హనుమకొండ నుంచి ములుగు సమీపంలోని గట్టమ్మ ఆలయం వరకు 30 కిలోమీటర్ల రోడ్డును సుమారు రూ.317 కోట్లతో ఫోర్‌లేన్‌గా విస్తరించే పనులు చేపట్టారు. కానీ బిల్లుల సమస్య కారణంగా పనులు అక్కడక్కడా ఆగిపోయాయి. ఫలితంగా హనుమకొండ, ఆత్మకూరు మధ్యలో ఓగ్లాపూర్ సమీపంలోని సైలానీ బాబా దర్గా వద్ద రోడ్డు ఇరుకుగా మారింది. రెండు వైపులా స్లాబ్ పూర్తయినా ఎక్స్‌టెన్షన్ మాత్రం పూర్తి కాలేదు.
ఊరుగొండ సమీపంలో ఎస్సారెస్పీ కెనాల్ బ్రిడ్జిని కూడా విస్తరించాల్సి ఉంది. ఆత్మకూరు దాటిన తర్వాత కటాక్షపూర్ వద్ద కూడా బ్రిడ్జి పూర్తికాకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నెల 10లోగానే రోడ్ల రిపేర్లను పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ గతంలో ఆదేశించడంతో అక్కడక్కడ రోడ్లపై గుంతలు పూడ్చిన ఆఫీసర్లు, మూలమలపులు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి వదిలేశారు.