అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి కొత్త వారిని ఆహ్వానించినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్న నాయకులను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించేది లేదన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పాతవారిని పక్కనపెట్టి, కొత్తవారికి సీట్లు ఇవ్వడం కాంగ్రెస్ ఆనవాయితీ కాదని చెప్పారు. మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ తో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వీహెచ్ హనుమంతరావులు సమావేశం నిర్వహించారు.
పార్టీని నమ్ముకొని ఉన్న వారికి సరైన ప్రాధాన్యత కల్పిస్తామని మధుయాష్కీ అన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపు జరగలేదని, మైనంపల్లికి టికెట్ ఇస్తారని జరుగుతున్న ప్రచారం సరికాదన్నారు .. కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైన అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ALSO READ : ఏసీ గాలితో నవజాత శిశువులు మృతి
ఈ సందర్భంగా నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు మల్కాజిగిరి సీటుకు సంబంధించి ఎలాంటి స్పష్టత లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాను మల్కాజిగిరి నియోజకవర్గం నుండి పోటీ చేయడం ఖాయమని తెలిపారు. దీనిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, వీహెచ్ హనుమంతరావు చర్చలు జరిపారని తెలిపారు. ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అనే ఉదయపూర్ డిక్లరేషన్ ఇక్కడ కూడా వర్తిస్తుందని ఆయన తెలిపారు.