![ఐపీఓ కోసం మళ్లీ దరఖాస్తు చేసిన మెడి అసిస్ట్](https://static.v6velugu.com/uploads/2023/08/Medi-Assist-Healthcare-Services-has-filed-preliminary-documents-with-capital-markets_M6dti2h1PE.jpg)
న్యూఢిల్లీ : మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ సర్వీసెస్ ఐపిఓ ద్వారా నిధులను సమీకరించడానికి క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. పబ్లిక్‌కి వెళ్లేందుకు కంపెనీకి ఇది రెండో ప్రయత్నం. అంతకుముందు, ఇది ఐపీఓను తేవడానికి 2021 నెలలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. అయితే కరోనా కారణంగా మార్కెట్లకు నష్టాలు రావడంతో వెనక్కి తగ్గింది. ప్రమోటర్లు, ఇప్పటికే ఉన్న వాటాదారులు 2.8 కోట్ల వరకు షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా అమ్ముతారు. వాటాలను విక్రయిస్తున్న వారిలో విక్రమ్ జిత్ సింగ్ ఛత్వాల్, మెడిమాటర్ హెల్త్ మేనేజ్‌మెంట్, బెస్సెమర్ ఇండియా క్యాపిటల్ హోల్డింగ్స్ 2 లిమిటెడ్, బెస్సెమర్ హెల్త్ క్యాపిటల్ ఎల్ఎల్సీ ఇన్వెస్ట్‌కార్ప్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ఉన్నాయి. ఇష్యూ పూర్తిగా ఓఎఫ్ఎస్ అయినందున, కంపెనీకి ఎలాంటి ఆదాయమూ ఉండదు. మొత్తం నిధులు వాటాదారులకు వెళ్తాయి. బెంగళూరుకు చెందిన మెడి అసిస్ట్ బీమా కంపెనీలకు థర్డ్‌పార్టీ అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరిస్తోంది.