అర్హులైన జర్నలిస్టులకుఇండ్ల స్థలాలు :కె.శ్రీనివాస్​రెడ్డి వెల్లడి

  • మీడియా అకాడమీ చైర్మన్​ కె.శ్రీనివాస్​రెడ్డి వెల్లడి

ముషీరాబాద్, వెలుగు: అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇచ్చే విధంగా కృషి చేస్తానని మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. ఈ సమస్యను ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో కొత్త పాలసీ రూపకల్పన ద్వారా ఇండ్ల స్థలాలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పారు.

గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో -ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్​లోని మీడియా అకాడమీ కార్యాలయంలో చైర్మన్  శ్రీనివాస్ రెడ్డిని కలిసి జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్య, సొసైటీ విషయాలపై చర్చించారు.

తమ సొసైటీ 2008లో ఏర్పడిందని, అప్పటి నుంచి మూడు దఫాలుగా జర్నలిస్టుల నుంచి సభ్యత్వం తీసుకోవడం జరిగిందని, ప్రస్తుతం సొసైటీలో 1,300 మంది సభ్యులున్నారని అధ్యక్షుడు మామిడి సోమయ్య వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివిధ పత్రికలు, చానెళ్లలో పని చేస్తున్న సీనియర్ జర్నలిస్టులు చాలా ఏండ్లుగా ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.

అనంతరం శ్రీనివాస్ రెడ్డి  మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందని.. అయితే, ఏ విధంగా ఇవ్వాలన్న విషయంలో కసరత్తు చేయాల్సి ఉన్నందున దీనికి కొంత సమయం పడుతుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీలో ఉన్న 1,300 మంది జర్నలిస్టుల అర్హత, సీనియారిటీ ప్రకారం లిస్టు ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో సొసైటీ ప్రతినిధులు యర్రమిల్లి రామారావు, కరుణాకర్, అంజిరెడ్డి, నాగవాణి, టి.శాంతి తదితరులు పాల్గొన్నారు.