మన దేశంలో మీడియా విచారణలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అవి న్యాయానికి ప్రతిబంధకంగా మారుతున్నాయని , ప్రజాస్వామ్యానికి హాని కలిగిస్తున్నాయనేది చాలా మంది అభిప్రాయం. మీడియా, సోషల్‌మీడియా బాధ్యాతాయుతంగా ప్రవర్తించాలి. కోర్టులు బాధ్యతాయుతంగా వ్యవహరించి కేసులను సత్వరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మీడియా, సోషల్‌మీడియా వల్ల సమస్య ఉధృతమవుతోందని లఖింపూర్ ఖేరీ కేసులో నిందితుడికి బెయిల్ తిరస్కరిస్తూ అలహాబాద్హైకోర్టు జడ్జి తన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు.
కంగారూ కోర్టులంటే?
ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం కంగారూ కోర్టు అంటే కొంత మంది వ్యక్తుల సమూహం నిర్వహించే కోర్టు. ఎలాంటి మంచి సాక్ష్యాలు లేకుండానే ఒక వ్యక్తిని విచారించి శిక్షించే అనధికారిక కోర్టు. మెరియమ్ వెబ్‌స్టర్ నిఘంటువు ప్రకారం ఇది ఒక వెక్కిరించే(మాక్) కోర్టు. ఈ కోర్టులో చట్టం ఉండదు. న్యాయ సూత్రాలు ఉండవు. ఉన్నా అవి వక్రీకరించబడతాయి. మరో విధంగా చెప్పాలంటే ఇది బాధ్యతారహిత, అనధికార, ఎలాంటి విధానాలు లేని కోర్టు. ఈ కోర్టు అన్యాయమైన, పక్షపాత నిర్ణయాలు తీసుకొని తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది. కంగారూ కోర్టులు తొలుత మైనింగ్ లావాదేవీలకు సంబంధించి మొదలైనట్లు చెబుతారు. కాంగారూ కోర్టులు అన్న పదబంధం మొదటిసారి1849లో గోల్డ్‌రష్ సమయంలో అమెరికాలో కనిపించింది. ఈ పద బంధాన్ని మొదట అమెరికాలో నైరుతి ప్రాంతంలో వాడారు. 1853లో టెక్సాస్‌లో ప్రచురించిన ఓ పుస్తకంలో దీన్ని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా సిడ్నీ నుంచి వచ్చే మార్నింగ్హెరాల్డ్పత్రికలో ప్రచురించిన ఓ వ్యాసంలో ‘‘1849–1950లో పదబంధం మొదట కనిపించింది. ఆస్ట్రేలియా దేశస్తులు బంగారం కోసం తవ్వుతున్నారు. ఆ భూముల విషయంలో తమ సొంత నిర్ణయాలు, అన్యాయమైన విధానాలు చేశారు’ అని పేర్కొన్నారు.
భారతదేశంలో..
మన దేశంలో కంగారూ కోర్టు అన్న పదబంధాన్ని ఎందుకు ఉపయోగిస్తారన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. సోషల్ మీడియా, ఆన్లైన్ మీడియా పెరిగిన కాలంలో ఈ పదం వాడటం పెరిగింది. ఈ రెండింటి మీద నియంత్రణ తక్కువగా ఉంటుంది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లాంటి సోషల్ప్లాట్ఫామ్స్లో జరిగే చర్చలు, టీవీల్లో జరిగే డిబేట్ల ద్వారా ఒక వ్యక్తి మీద కోర్టులు నిర్ధారించడానికి కన్నా ముందే ఒక అభిప్రాయాన్ని ఏర్పరుస్తున్నారు. కోర్టుల్లో ఉన్న అంశాల మీద యథేచ్ఛగా తమ తీర్పులను, నిర్ణయాలను మీడియా వ్యక్తం చేస్తోంది. మన న్యాయ సూత్రాల ప్రకారం.. నేరం నిరూపణ జరిగే వరకు ముద్దాయిని అమాయకుడిగా పరిగణించాలి. ఆ విషయాన్ని తుంగలో తొక్కి పారేస్తుంది మీడియా. ప్రతి రోజూ మీడియా తన తీర్పులను అనుమానితులపైన ప్రకటిస్తూనే ఉంది. న్యాయస్థానంలో కేసు ప్రారంభానికి ముందే మీడియా వెలువరించడం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది.
లఖింపూర్ ఖేరీ కేసులో..
లఖింపూర్‌ఖేరీ కేసులో ప్రధాన నిందితుడైన ఆశిశ్మిశ్రాకు బెయిల్ నిరాకరిస్తూ అలహాబాద్ హైకోర్టు మీడియా ధోరణులపై ఆందోళన వ్యక్తపరిచింది. తమ ఎజెండాలోని చర్చలను జరిపి కోర్టుల స్థానాన్ని ఆక్రమిస్తోందని పేర్కొంది. మీడియా చేస్తున్న దర్యాప్తులు, విచారణల వల్ల అనుమానితుడిపై ఒక వ్యతిరేక ప్రజాభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉందని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కంగారూ కోర్టులంటే ఒక మీడియా కోర్టులు మాత్రమే కాదు. నిజమని భావించే కోర్టులు కూడా కంగారూ కోర్టులు మాదిరిగా వ్యవహరించేలా పాలకులు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉంది. ఈజిప్టులో మిలటరీ తిరుగుబాటు జరిగిన రెండేండ్లలోనే ఆ దేశాధ్యక్షుడికి మరణ శిక్ష విధించారు. ఆయనపై ఎన్నో ఆరోపణలు చేశారు. దర్యాప్తు సమయంలో న్యాయవాదిని సహా ఎవరితో సంప్రదించకుండా చేశారు. కేసు విచారణ జరగడానికి కొన్ని గంటల ముందు చార్జిషీట్పత్రాలు ఇచ్చి, చివరకు మరణశిక్ష విధించారు. ఇలాంటి కోర్టులు కూడా కంగారూ కోర్టులే. ఈ తీర్పును అత్యంత తక్కువ సమయంలో కోర్టులు ప్రకటించాయి.
భుట్టో కేసులో విచారణ..
జనరల్ జియా అప్పటి పాక్ ప్రధానిని మిలటరీ తిరుగుబాటుతో తొలగించారు. ఆ తర్వాత ఆయన చేసిన మొదటి పని లాహోర్ హైకోర్టుకు, పాక్సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తులను నియమించడం. భుట్టో విచారణ గోప్యంగా జరిగింది. అతనిపై ఉన్న నేరారోపణలు రుజువయ్యాయని కోర్టు ప్రకటించింది. అతని అప్పీలును సుప్రీంకోర్టు డిస్మిస్చేసింది. ఆ తర్వాత జస్టిస్ డోరబ్ఫ్రామ్రోజ్పటేల్ భిన్నాభిప్రాయ తీర్పు వెలువరించారు. భుట్టో నిర్దోషి అని అతను ప్రకటించారు. అత్యంత శక్తిమంతమైన భిన్నాభిప్రాయ తీర్పును ప్రకటించినందుకే ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తుండిపోయారు. ఇలాంటి ప్రహసనమైన కోర్టులను కూడా కంగారూ కోర్టులనే అంటారు. ఇలాంటి కోర్టులు ఔరంగజేబు కాలంలో కూడా ఉన్నాయని ప్రతీతి. అతని చిన్న కుమారుడు సముఘర్వద్ద జరిగిన వారసత్వ యుద్ధంలో దారాని ఓడించాడు. ఉపనిషత్తులను విదేశీ భాషలోకి అనువాదం చేసిన మొదటి వ్యక్తి దారా. అతడిని మతభ్రష్టత్వం ఆరోపణ మీద విచారణ జరిపించాడు షాజహాన్. కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. ఆ కేసులో దానిష్మంద్ఖాన్అనే న్యాయమూర్తి దారాను నిర్ధోషిగా నిర్ధారించాడు. తప్పుడు విచారణలు జరిపే మీడియాలను ప్రభుత్వాధినేతల కనుసన్నల్లో మెదిలే ప్రహసన న్యాయస్థానాలను కూడా కంగారూ కోర్టులనే అంటారు. - మంగారి రాజేందర్, రిటైర్డ్ జిల్లా జడ్జి