ప్రజాస్వామ్యంలో మీడియా కీలక రంగం : గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

ప్రజాస్వామ్యంలో మీడియా కీలక రంగం : గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

 హైదరాబాద్, వెలుగు: ప్రజాస్వామ్యంలో మీడియా రంగం అత్యంత ప్రాధాన్యత కలిగినదని, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం మీడియా అని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. ప్రజలకు, పాలకులకు వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారం అందించడం గొప్ప విషయమని చెప్పారు. టెక్నాలజీకి అనుగుణంగా మీడియా రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకొని రిపోర్టర్లు పనిచేస్తున్నారని మెచ్చుకున్నారు. సోమవారం రాజ్ భవన్​లో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(జేఏటీ) 2025 డైరీని గవర్నర్ ఆవిష్కరించారు. అనంతరం జర్నలిస్ట్ స్టేట్ కమిటీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. డిజిటల్ రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులను అభినందించారు.

సమాజం కోసం నిరంతరం పనిచేస్తున్న విలేకరులు ఆదర్శప్రాయులని కొనియాడారు. ఈ సందర్భంగా అందరినీ పలకరించి, మీడియా రంగంలో వస్తున్న మార్పులు, సమస్యల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పగుడాకుల బాలస్వామి, ప్రధాన కార్యదర్శి జూలూరి రమేశ్, నాయకులు చిలుకూరి అఖిలేష్, అశోక్, అనిల్, మోహన్, తిరుమలేశ్, రాఘవేంద్ర గౌడ్, గిరిధర చారి, కిషోర్, సత్యం, దుర్గాప్రసాద్, రామ్మోహన్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.