మునుగోడు బైపోల్ కౌంటింగ్ ఆలస్యంపై మీడియా ప్రతినిధుల ఆందోళన

మునుగోడు బైపోల్ కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా ఓట్ల లెక్కింపు నెమ్మదించింది. దీంతో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. మొదటి రౌండ్ నుంచి నాలుగో రౌండ్ వరకు కౌంటింగ్ అత్యంత వేగంగా జరిగింది. అయితే 5వ రౌండ్ వచ్చేసరికి మాత్రం దాదాపు గంట దాటినా కౌంటింగ్ కు సంబంధించిన వివరాలను వెల్లడించకపోవడంపై సందిగ్ధత నెలకొంది. ఐదో రౌండ్ ఫలితాలు ప్రకటించకపోవడంపై మీడియా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ అధికారులకు సరైన ట్రైనింగ్ ఇవ్వకపోవడంతో ఈవీఎంల సీల్ కూడా ఓపెన్ చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. రిజల్ట్స్ కూడా సరిగా ఇవ్వకుండా కరెక్షన్స్ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. 

మునుగోడు కౌంటింగ్ లో రౌండ్ల వారిగా ఫలితాల వెల్లడిలో ఆలస్యం కావడంతో ఈసీఐ వైఖరిపై బీజేపీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.