- అన్‌ఫిట్’ సర్టిఫికెట్ కోసం రూ. 5 లక్షలకు పైగా డిమాండ్
- డబ్బులు ఇవ్వకపోతే ఫిట్ ఫర్ జాబ్’ అంటూ సర్టిఫికెట్
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో కారుణ్య నియామకాల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు కొందరు ఆఫీసర్లు, నేతలకు కాసుల పంట పండిస్తోంది. ‘మేము అనారోగ్యంతో బాధపడుతున్నాం.. ఇగ పనిచేయలేం.. మమ్మల్ని అన్‌ఫిట్‌గా ప్రకటించి, మా వారసులకు ఉద్యోగం ఇవ్వండి’ అని అప్లై చేసుకున్న కార్మికుల నుంచి ఆఫీసర్లు అందిన కాడికి దండుకుంటున్నారు. అడిగినన్ని పైసలు ఇస్తే ‘అన్‌ఫిట్’ అంటూ సర్టిఫికెట్ ఇస్తున్నారు. లేదంటే రివ్యూ అంటూ హైదరాబాద్‌కు తిప్పడం గానీ, ‘ఫిట్ ఫర్ జాబ్’ అంటూ సర్టిఫికెట్ ఇవ్వడంగానీ చేస్తున్నారు.
రూ. 5 లక్షల నుంచి రూ. 6.50 లక్షలు వసూలు
సింగరేణిలో పనిచేస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు తమ వారసులకు ఇదే కంపెనీలో ఉద్యోగం ఇప్పించేందుకు ఏర్పాటు చేసిందే మెడికల్ బోర్డు. కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ హాస్పిటల్‌లో ఉండే ఈ బోర్డులో హైదరాబాద్‌లోని ఉస్మానియాతో పాటు పలు హాస్పిటల్స్‌కు చెందిన నలుగురు డాక్టర్లు, సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉంటారు. వీరికి సపోర్ట్‌గా సింగరేణి మెయిన్ హాస్పిటల్‌కు చెందిన ఇద్దరు ఫిజీషియన్స్, ఇద్దరు ఆర్థో డాక్టర్లు ఉంటారు. మెడికల్ బోర్డుకు అప్లై చేసుకున్న కార్మికులను ఆయా డాక్టర్లు పరిశీలించి ‘అన్ ఫిట్’ అని సర్టిఫై చేయాల్సి ఉంటుంది.
ఇక్కడే కొందరు వ్యక్తులతో పాటు, సింగరేణి మెయిన్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న కొందరు చక్రం తిప్పుతున్నారు. ‘అన్ ఫిట్’ సర్టిఫికెట్ కోసం ఒక్కో కార్మికుడి నుంచి రూ. 5 లక్షల నుంచి రూ. 6.50 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చిన వారికే ‘అన్ ఫిట్’ సర్టిఫికెట్ ఇచ్చేలా డాక్టర్లతో మాట్లాడుకుంటున్నారు. నిజంగా అనారోగ్యంతో బాధపడుతూ, డబ్బులు ఇవ్వని కార్మికులను రివ్యూ అంటూ హైదరాబాద్‌కు రెఫర్ చేయడం గానీ, ‘ఫిట్ ఫర్ జాబ్’ అని రాయడం గానీ చేస్తున్నారు. మరికొందరిని సర్ఫేజ్ జాబ్‌కు రెఫర్ చేస్తున్నారు.
సింగరేణిలో ఇప్పటివరకు 21 వేల మంది కార్మికులు మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 12,365 మందిని అన్‌ఫిట్‌గా ప్రకటించారు. గత మూడు నెలలుగా మెడికల్ బోర్డులో దళారుల దందా పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. గత రెండు నెలల్లో జరిగిన రెండు బోర్డులకు సుమారు 400 మంది అటెండ్‌కాగా 280 మంది అన్‌ఫిట్ అయ్యారు.
డాక్టర్లు, సిబ్బందే దళారులుగా..
కొన్ని రోజుల కిందటి వరకు కొందరు యూనియన్ లీడర్లు, కార్మికులే దళారులుగా వ్యవహరించారు. ఇప్పుడేమో ఏకంగా కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ హాస్పిటల్‌లో కీలక పదవిలో ఉన్న డాక్టర్ అండదండలతో మరో డాక్టర్‌తో పాటు క్లర్క్, అటెండర్ స్థాయి ఉద్యోగులు దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మణుగూరు సింగరేణిలో పనిచేస్తున్న ఓ ఉద్యోగితో పాటు హెడ్ ఆఫీస్‌లో ఆఫీసర్లకు ప్రైవేట్ వెహికల్ పెట్టి ఓ డ్రైవర్ మెడికల్ బోర్డులో దందా సాగిస్తుండడం గమనార్హం.
డిప్యూటీ సీఎం భట్టి మాటలూ బేఖాతర్
మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారందరినీ అన్‌ఫిట్‌గా ప్రకటించాలని సింగరేణి ఆఫీసర్లతో ఇటీవల నిర్వహించిన రివ్యూలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారే బోర్డుకు అప్లై చేసుకుంటారని, వారిని అన్ ఫిట్ చేస్తే సంస్థలోకి యువకులు వచ్చే అవకాశం ఉంటుందని, దళారులకు కూడా చెక్ పడుతుందని చెప్పారు. కానీ డిప్యూటీ సీఎం ఆదేశాలు కూడా సింగరేణి ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు.
అక్రమాలకు తావు లేదు
మెడికల్ బోర్డులో ఎలాంటి అక్రమాలు జరగడం లేదు. అన్ ఫిట్ చేయిస్తామంటూ కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బోర్డులో పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నాం.
సుజాత, సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్