- రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏవో, జూనియర్ అసిస్టెంట్
- భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఘటన
పాల్వంచ,వెలుగు: ఔట్ సో ర్సింగ్ సిబ్బందిని విధుల్లోకి తీసుకొనేందుకు లంచం తీసుకుంటూ భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మెడికల్ కాలేజీ ఏవో, జూనియర్ అసిస్టెంట్ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. ఏసీబీ డీఎస్పీ వై. రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ మెడికల్ కాలేజీలో గతంలో నియమితులైన 49 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అనవసరంగా ఏవో ఖలీలుల్లా తొలగించారు.
వారు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో 26 మందిని విధుల్లోకి తీసుకున్న ఏవో, మరో 23 మందికి కనీస అర్హతలు లేవంటూ పక్కన పెట్టారు. దీంతో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించిన ఏజెన్సీ ప్రతినిధులు ఏవోను కలిసి మిగిలిన 23 మందిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అయితే వారికి కనీస అర్హ తలు లేవని, తిరిగి విధుల్లో కి తీసుకోవాలంటే రూ.15 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఏజెన్సీ నిర్వాహకులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
ప్లాన్ ప్రకారం రూ.7 లక్షలు లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న నిర్వాహకులు.. మొదటి విడతగా మంగళవారం రూ.3 లక్షలు, మిగతా రూ.4 లక్షలు శనివారం ఇస్తామని చెప్పడంతో అంగీకరించి కాలేజీలోని తన ఆఫీసులో డబ్బులు ఇవ్వాలని ఖలీలుల్లా సూచించారు. ఏజెన్సీ ప్రతినిధులు డబ్బులు ఇస్తుండగా ఖలీలుల్లాతో పాటు జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఏఈ..
బషీర్ బాగ్, వెలుగు: జీహెచ్ఎంసీకి చెందిన ఓ ఆఫీసర్ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కాడు. వివరాలు ఇలా ఉన్నాయి. బల్దియాలో ఓ ప్రాజెక్టు కొలతల పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇటీవల వర్క్ కంప్లీట్ చేశాడు. వాటికి సంబంధించిన బిల్లులు పాస్ చేయాలని జీహెచ్ఎంసీ రాజేందర్ నగర్ సర్కిల్ లోని ఇంజనీరింగ్ సెక్షన్ ఏఈ వెన్కోబాను కోరాడు. బిల్లులు పాస్‌చేసేందుకు రూ.50 వేలు లంచం ఇవ్వాలని వెన్కోబా డిమాండ్ చేశాడు.
దీంతో ఆ కాంట్రాక్టర్ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఏఈ వెన్కోబా కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండంగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అబిడ్స్‌లోని జీహెచ్ఎంసీ ఆఫీసులో సోదాలు నిర్వహించారు. అనంతరం ఏఈ వెన్కోబాను కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.