- అన్ని అనుకూలతలున్నాయన్న కమిటీ ఈ ఏడాది నుంచే క్లాసులు షురూ
మెదక్, వెలుగు: ఈ అకడమిక్ ఇయర్‌నుంచే మెదక్ లో మెడికల్ కాలేజీ ప్రారంభం కానుంది. పాత కలెక్టరేట్ బిల్డింగ్‌లో తాత్కాలికంగా క్లాసులు నిర్వహించనున్నారు. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా గత ఏడాది మెదక్ కు మెడికల్ కాలేజీ మంజూరైంది. అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారడంతో ఇప్పట్లో మెడికల్ కాలేజీ ప్రారంభమవుతుందా అన్న సందేహాలు వినిపించాయి. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కాలేజీకి అవసరమైన సౌకర్యాలు ఉన్నాయని తేల్చింది. ప్రభుత్వం ప్రిన్సిపల్‌ను నియమించడం ద్వారా మెడికల్ కాలేజీ ప్రారంభానికి గ్రీన్సిగ్నల్ఇచ్చింది.
అందుబాటులో 240 బెడ్స్
నేషనల్ మెడికల్‌కౌన్సిల్ (ఎన్ఎం సీ) గైడ్ లైన్స్ ప్రకారం కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే దానికి అనుబంధంగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో 240 బెడ్స్ ఉండాలి. క్లాస్ ల నిర్వహణకు, ల్యాబ్‌లకు మౌలిక వసతులు ఉండాలి. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, గాంధీ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్, మెదక్ డీఎంహెచ్ఓ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కోఆర్డినేటర్లతో కూడిన కమిటీ మెదక్ లో పర్యటించి మెడికల్ కాలేజీ నిర్వహణకు అవసరమైన సౌకర్యాలు, సదుపాయాలను పరిశీలించింది.
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 120 బెడ్స్, ఎంసీహెచ్‌లో 120 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎంసీహెచ్ పక్కనే 50 బెడ్స్ కెపాసిటీతో క్రిటికల్ కేర్ బిల్డింగ్ నిర్మాణం అవుతోంది. దీంతోపాటు కాలేజీ కోసం కొత్త బిల్డింగ్ నిర్మించే వరకు అనువైన టెంపరరీ బిల్డింగ్ సైతం అందుబాటులో ఉన్నట్టు కమిటీ గుర్తించింది. వారి రిపోర్ట్ మేరకు కాలేజీ ప్రారంభానికి ఓకే చెప్పిన ప్రభుత్వం ప్రిన్సిపల్ గా డాక్టర్ రవీందర్‌ను నియమించింది. ప్రస్తుతం ఆయన మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్)లో పని చేస్తున్నారు.
పాత కలెక్టరేట్లో తరగతులు
మెడికల్ కాలేజీ కోసం ప్రభుత్వం రూ.180 కోట్లు మంజూరు చేసింది. పట్టణ శివారులో ఉన్న ఎంసీహెచ్ ముందర 14 ఎకరాల స్థలాన్ని మెడికల్ కాలేజీ కోసం కేటాయించారు. మరో 15 ఎకరాల స్థలం సేకరించాల్సి ఉంది. స్థల సేకరణ, టెండర్లు పూర్తయి కాలేజీ, హాస్టల్ లకు కొత్త బిల్డింగ్ ల నిర్మాణం జరగడానికి సమయం పడుతుంది. అప్పటి వరకు పట్టణ శివారు పిల్లికొటాల్లోని పాత ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ బిల్డింగ్‌లో మెడికల్ కాలేజీ నిర్వహించాలని నిర్ణయించారు. అక్కడ క్లాస్‌ల నిర్వహణ, ల్యాబ్ ల ఏర్పాటు కోసం రూ.2 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ ఎం సీ) కమిటీ వచ్చి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తే ఈ అకాడమిక్ ఇయర్ లో మెడికల్ కాలేజీ క్లాస్‌లు ప్రారంభమవుతాయి. కాలేజీకి 100 సీట్లు శాంక్షన్ అయినప్పటికి మొదట 50 మంది స్టూడెంట్స్‌తో కాలేజీ ప్రారంభించనున్నారు.