- అధికారుల చుట్టూ రైతుల ప్రదక్షిణ
- పెద్దూరులో కాలేజీ నిర్మాణానికి 50 ఎకరాల సేకరణ
- కాలేజీ నిర్మించి ప్రారంభమైనా పరిహారం రాలేదని రైతుల ఆవేదన
- తాజాగా అదనపు గదుల నిర్మాణ పనులను అడ్డుకొని నిరసన
రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల జిల్లాకేంద్రంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి తీసుకున్న భూములకు ఇంకా పరిహారం ఇయ్యలేదు. 2018లో గత ప్రభుత్వ హయాంలో సిరిసిల్లలో మెడికల్‌కాలేజీ నిర్మాణానికి పెద్దూరులో 50 ఎకరాలు సేకరించారు.
ఆ టైంలో పరిహారంతోపాటు భూమికి బదులు భూమి ఇప్పిస్తామని నాటి ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులకు హామీ ఇచ్చారు. 36 ఎకరాల్లో చేపట్టిన కాలేజీ నిర్మాణం 2023లో పూర్తయి ప్రారంభమైంది. కానీ నేటికీ రైతులకు ఇచ్చిన హామీ నెరవేరలేదు. దీంతో ప్రస్తుతం కాలేజీ అదనపు గదుల నిర్మాణ పనులను అడ్డుకున్నారు.
రైతులను ఒప్పించి.. మోసం చేశారు
2018లో సిరిసిల్లలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి పెద్దూరు శివారులోని సర్వేనంబర్ 408లోని 40 మందికి సంబంధించిన 50 ఎకరాలు సేకరించాలని నాటి బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది. రైతులకు సమాచారం ఇవ్వకుండా, వారికి ఎలాంటి పరిహారం హామీ ఇవ్వకుండానే భూమిని చదును చేశారు. విషయం తెలుసుకున్న రైతులు పరిహారం ఇవ్వకుండా తమ భూముల్లో మెడికల్ కాలేజీ నిర్మాణాలను ఎలా ప్రారంభిస్తారని నిర్మాణ పనులను అడ్డుకున్నారు.
దీంతో అప్పటి మంత్రి కేటీఆర్, అధికారులు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, పరిహారంతోపాటు భూమికి బదులు భూమి, ఎకరాకు వెయ్యి గజాల చొప్పన హరిత హోటల్ పక్కన ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఆ తర్వాత మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయింది. క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం, నాటి పెద్దలు మరిచిపోయారు. దీంతో రైతులు పలుమార్లు కేటీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతోపాటు ఆయన కూడా పట్టించుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
అదనపు నిర్మాణ పనుల అడ్డగింత
ఐదేండ్లుగా పరిహారం ఇవ్వకపోవడంతో ఇటీవల మెడికల్ కాలేజీ అదనపు గదలు నిర్మాణ పనులను రైతులు అడ్డుకున్నారు. కొన్ని రోజుల కింద రెవెన్యూ అధికారులు, కాంట్రాక్టర్.. మెడికల్ కాలేజీ సమీపంలో అదనపు గదులు నిర్మాణ పనులను ప్రారంభించగా అడ్డుకున్నారు. ఇప్పటికే భూములు తీసుకుని పరిహారం ఇవ్వలేదని, మళ్లీ తిరిగి ఇతర నిర్మాణాలు చేపట్టడం ఏమిటని రైతులు నిలదీశారు. తమకు పరిహారం ఇచ్చాకే పనులు చేయాలని రైతులు తేల్చి చెప్పారు.
కేటీఆర్ హామీతో భూములిచ్చినం
భూమి కోల్పోయిన రైతులకు భూమి ఇస్తామని అప్పటి మంత్రి కేటీఆర్ హామీతోనే మెడికల్‌కాలేజీకి భూములిచ్చినం. ఇప్పుడు కాలేజీ పూర్తయింది. కానీ మాకు భూమికి బదులు భూమి రాలేదు. కేటీఆర్ నమ్ముకుని భూములిచ్చినందుకు బతుకుదెరువు కోల్పోయినం.
- సలెంద్రి బాల్‌రాజు, రైతు, పెద్దూరు