అర్హతలేని డాక్టర్లు, అనుమతి లేని ఆస్పత్రులు

అర్హతలేని డాక్టర్లు, అనుమతి లేని ఆస్పత్రులు

సూర్యాపేట, వెలుగు : తెలంగాణ మెడికల్ కౌన్సిల్, సూర్యాపేట ఐఎంఏ సభ్యులు కలిసి గురువారం సూర్యాపేటలోని పలు ప్రైవేట్​ ఆస్పత్రుల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు అక్రమాలు వెలుగు చూశాయి. నకిలీ సర్టిఫికెట్లతో అర్హత లేకుండా 13 ఏండ్లుగా నడుపుతున్న స్కానింగ్ సెంటర్ బాగోతం బయటపడింది. జిల్లా కేంద్రంలో ఆపిల్ స్కాన్ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ కిరణ్ ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎండీ రేడియాలజిస్ట్ గా నకిలీ సర్టిఫికెట్స్ సృష్టించారు. దీనిపై ఆపిల్ స్కాన్ సెంటర్ పేరును 2013 లో రిజిస్టర్ చేసుకోగా, గతేడాది సెప్టెంబర్ లో దీనిని వైద్యారోగ్యశాఖ అధికారులు గుడ్డిగా రెన్యువల్ చేశారు. అంతేకాకుండా ఇదే స్కాన్ సెంటర్ లో పనిచేస్తున్న మరో రేడియాలజిస్ట్  జుల్ఫికర్ అలీఖాన్ ఎంబీబీఎస్ పూర్తిచేసి ఎండీగా చెప్పుకుంటూ వైద్య సేవలు చేస్తున్నాడు. 

అయితే సదురు డాక్టర్ ఎంబీబీఎస్ ఏపీ రిజిస్ట్రేషన్ చేసుకోగా, తెలంగాణ రిజిస్ట్రేషన్ లేకుండానే ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ వ్యవహారం బయట పడడంతో అతడు వెంటనే బోర్డు మార్చేశాడు. జిల్లా కేంద్రంలో సాయిగణేశ్ హాస్పిటల్ నడిపిస్తున్న డాక్టర్ సందీప్ కుమార్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి 2019 నుంచి సూర్యాపేటలో ఎండీ డాక్టర్ గా చలామణి అవుతూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నడిపిస్తున్నాడు. రెండేళ్ల క్రితం చైనా ఎంబీబీఎస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన రెన్యువల్ చేయకుండా ఆస్పత్రి నిర్వహిస్తున్నారు.

 తనిఖీల సమయంలో రెండేళ్ల నుంచి ప్రాక్టీస్ చేయడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. మెడికల్ కౌన్సిల్ సభ్యులు పేషెంట్ ఔట్ పేషెంట్ షీట్లను పరిశీలించి ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేసుకున్న పేషెంట్లకు ఫోన్ చేసి వారితో మాట్లాడి సదురు డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నారని నిర్ధారించారు. శ్రీకృష్ణ ఆస్పత్రి నిర్వహిస్తున్న డాక్టర్ రవిశేఖర్ అనస్తీషియాలో అర్హత ఉండడంతో సర్జరీలు చేస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. అంతేకాకుండా ఆస్పత్రిలో ఎలాంటి పర్మిషన్ లేకుండా అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ నిర్వహిస్తుండగా, అందులో ఏపీలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న రేడియాలజిస్ట్​ పనిచేస్తున్నాడు.