![గ్రామాల్లో వైద్య సదుపాయాలు పెంచాలి](https://static.v6velugu.com/uploads/2025/02/medical-facilities-should-be-increased-in-villages_P1COiVdjWv.jpg)
- పీఏసీ సమావేశంలో ఆఫీసర్లకు సభ్యుల సూచన
- గత ఎనిమిదేండ్ల ఆడిట్ లెక్కలపై ఆరా
- సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు పీఏసీ(పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) మెంబర్లు సూచించారు. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో చైర్మన్ అరికెపూడి గాంధీ అధ్యక్షతన పీఏసీ మీటింగ్ నిర్వహించారు.
ఈ సమావేశానికి పీఏసీ సభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, అహ్మద్ బిన్ అబ్దుల్ బలాల, ఎమ్మెల్సీలు భాను ప్రసాద్ రావు, ఎల్.రమణ, సత్యవతి రాథోడ్, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ పి.మాధవి, సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ రాకేశ్ సి.సజ్జన్, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తు, మెడికల్ హెల్త్ కమిషనర్ ఆర్వీ.కర్ణన్ అటెండ్ అయ్యారు.
రాష్ట్రంలో పేదలకు అందుతున్న వైద్య సేవలు, కొత్త ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల నిర్మాణం, ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, మందుల పంపిణీ, డాక్టర్లు, సిబ్బంది సమస్యలు, పీజీ సీట్ల వివరాలు, మెడికల్ హెల్త్‌పై మూడు గంటలకు పైగా చర్చించారు. వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించి 2014-–15 నుంచి 2021-–22 వరకు ఉన్న పెండింగ్ ఆడిట్ పేరాలపై కమిటీ చర్చించింది. తగినంత సమాచారం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన పీఏసీ సభ్యులు వచ్చే మీటింగ్‌కు సమగ్ర సమాచారంతో రావాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు.
ఎన్ని సార్లు సమావేశం పెట్టినా బహిష్కరిస్తం: బీఆర్ఎస్
ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించి పీఏసీ చైర్మన్‌ను నియమించే ఆనవాయితీని ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. చైర్మన్ పోస్టుకు హరీశ్ రావు నామినేషన్ దాఖలు చేస్తే దానిని మాయం చేశారని, పార్టీ ఆదేశాల ప్రకారం గత రెండు మీటింగ్‌లు బహిష్కరించామన్నారు. గత మీటింగ్‌లో మా ఎమ్మెల్సీ రమణ ప్రతిపక్ష నాయకున్ని సంప్రదించి చైర్మన్ ఎంపిక చేయాలని, దీనిపై పునరాలోచించాలని కోరినా స్పందన లేనందున ఈ సమావేశాన్ని కూడా బహిష్కరించామన్నారు. ఇంకా 30 సార్లు జరిగినా ఇలాగే, బహిష్కరిస్తామని మరో సభ్యుడు గంగుల కమలాకర్ తెలిపారు.