
ఉమ్మడి నల్గొండ జిల్లా మెడికల్ హబ్ గా మారనుంది. రవాణా వసతులుండి, అన్ని రంగాల్లో దూసుకుపోతున్న జిల్లాలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నాయి. ఈ అకడమిక్ ఇయర్‌లోనే మెడికల్ కాలేజీలు మొదలుకానున్నాయి. నల్గొండ,సూర్యా పేటల్లో రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు మంజూరు చేయగా, నిర్మాణాలువేగంగా సాగుతున్నాయి. యాదాద్రి జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ మంజూరు చేసింది. బీబీనగర్‌లో నిర్మిస్తున్న ఎయిమ్స్ స్థలసేకరణలో కొంత జాప్యం జరుగుతుండటంతో అధికారులు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూడు పూర్తయితే ప్రజలకు సూ పర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుంది.
సూర్యాపేటలో వేగంగా పనులు
ప్రస్తుతం వంద పడకలున్న సూర్యా పేట జిల్లా కేంద్ర ఆసుపత్రి స్థాయిని 300 పడకలకు పెంచనున్నారు. దీనికి అనుబంధంగానే మెడికల్ కాలేజీ మంజూరైంది. కాలేజీ నిర్మా ణానికి ప్రభుత్వం రూ.499.35 కోట్లు మంజూరు చేసింది. వివిధ విభాగాల్లో 952 పోస్టుల భర్తీకి జీవో కూడా జారీ చేసింది. అనాటమీ, బయో కెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయోలజీ, ఫార్మకాలజీ తదితర 36 విభాగాల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు పోస్టుల భర్తీ చేయనున్నారు. 237 నాలుగో తరగతి పోస్టులు మంజూరు అయ్యాయి. అన్ని అనుకున్నట్టు అయితే ఈయేడే ఇక్కడ అడ్మిషన్ లు జరగనున్నాయి.
రెండు నెలల్లో ఎయిమ్స్ …
యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మిస్తున్న ఎయిమ్స్ సేవలు కూడా రెండు నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. ఎయిమ్స్ కు 220 ఎకరాల స్థలం అవసరం. బీబీనగర్ మండలం రంగాపురం శివారులో 161ఎకరాల్లోని నిమ్స్ భవనాన్ని ఇటీవల కేంద్ర బృందం పరిశీలించింది. ఎయిమ్స్‌కు మరో 60 ఎకరాలు కావాలి. ప్రస్తుతం 140 ఎకరాల స్థలం అందుబాటులో ఉండగా, మరో80 ఎకరాలు సేకరించాలి. ఇందుకు ప్రభుత్వం రూ.16 కోట్లు విడుదల చేసింది. అయితే మేలో 50 సీట్లకు అడ్మిషన్లు పూర్తిచేసి క్లాసు లు ప్రారంభిస్తారు. ఎయిమ్స్ భవనం నిర్మాణం జరిగేవరకు భువనగిరి సమీపంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ భవనాన్ని సిద్ధం చేసిన అధికారులు అనుమతి కోసం నివేదికలు పంపించారు. నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలు వస్తే ఈ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుంది. హైవేలుండడంవల్ల తరచూ జరిగే ప్రమాదాల్లో గాయపడినవారికి వెంటనే సేవలు అందుతాయి. అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్, విజయవాడ, ఖమ్మం కువెళ్లాల్సిన పరిస్థితి తప్పుతుంది. ఈ రెండు జిల్లాల్లోని నాగార్జున సాగర్ , దేవరకొండ, కోదాడ, హుజూర్ నగర్ , మిర్యాలగూడ ప్రాంతాల ప్రజలకు ఇవి సంజీవనిగా మారతాయి. ఎయిమ్స్ కూడా పూర-్తయితే ఉమ్మడి జిల్లాకు మరింత మేలు కలుగుతుంది.
నల్లగొండలో వడివడిగా..
ఏప్రిల్ నెలాఖరు నాటికి అన్ని హంగులతో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తిచేసి క్లాసులు ప్రారంభించేలా ఇంజినీరింగ్ విభాగం వేగంగా పనులుచేస్తోంది. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ క్లాసులు స్టార్ట్ చేసేందుకు అవసరమైన వసతులు ఏర్పాటు చేస్తోంది. అనాటమీ తదితర విభాగాల పనులు తుదిదశలో ఉన్నాయి. 550 పడకల సామర్థ్యమున్న జిల్లా ప్రభుత్వ దవాఖానలకు అనుబంధంగా ఏర్పడుతున్న కాలేజీ కోసం పాత బిల్డింగును ఆధునీకరించేందుకు ప్రభుత్వం రూ.7.77 కోట్లు మంజూరు చేసింది. ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్లో బయో కెమిస్ట్రీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. మెటర్నటీ వార్డులను ఫిజియాలజీ డిపార్టమెంట్‌గా ఆధునికీకరించారు. రెండో అంతస్తు లోసెంట్రల్ లైబ్రరీ, స్టూడెంట్ల కామన్ రూమ్ లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాదే 150 ఎంబీబీఎస్ సీట్లతో కాలేజీ మొదలవుతుంది. ఇప్పటి కే ప్రిన్సిపల్ తో పాటు వివిధ విభాగాల హెడ్‌లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. మెడికల్ కాలేజీకి రూ.275 కోట్లతో కొత్త బిల్డింగులు కడతారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణలోఈ భవనాలను కట్టేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. స్థల పరిశీలన పూర్తికాగా,ఆసుపత్రుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ టెండర్ ప్రక్రియను ప్రారంభించింది.