బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ మెడికల్ మాఫియా పెరిగిపోతుందని, ప్రభుత్వం స్పందించి అరికట్టాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) డిమాండ్చేసింది. ఈ మేరకు సమాఖ్య నాయకులు గురువారం కోఠిలోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసును ముట్టడించారు. లోపలికి వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా అరెస్ట్చేయడంతో విద్యార్థి సంఘాల నాయకులకు, పోలీసులకు తోపులాట, వాగ్వాదం జరిగింది.
ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.ధర్మేంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఆగడాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్అయిందని ధ్వజమెత్తారు.
ఇదే అదునుగా మెడికల్మాఫియా రెచ్చిపోతుందని, తాజాగా జరిగిన కిడ్నీ దందా అందులో భాగమేనన్నారు. 9 బెడ్లకు పర్మిషన్తీసుకుని 32 బెడ్లతో హాస్పిటల్రన్చేస్తుంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.