- ఇటీవల పిల్లిగుంట్ల తండాలో అధికారుల దాడులు
- స్కానింగ్ మిషన్ సీజ్, ఆరుగురిపై కేసు నమోదు
- లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవంటున్న మెడికల్ ఆఫీసర్లు
మహబూబాబాద్, వెలుగు: ఆడపిల్లల పట్ల వివక్ష ఉండకూడదనే ఉద్దేశంతో ఆరోగ్య శాఖ లింగనిర్ధారణ పరీక్షలు నిషేధించింది. అలా ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నది. కానీ, కొంతమంది ఆర్ఎంపీలు గిరిజన తండాలను టార్గెట్గా చేసుకుని గర్భం దాల్చిన మహిళలకు స్థానికంగానే ల్యాబ్ టెక్నీషియన్ల సహాయంతో స్కానింగ్ లు నిర్వహిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారు. గిరిజనుల బలహీనతను ఆసరాగా చేసుకుని మహబూబాబాద్ జిల్లాలోని పలు గిరిజన తండాల్లో యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు చేసి, ఆడపిల్ల అని గుర్తిస్తే అబార్షన్లు చేస్తున్నారు.
ముఠా అరెస్టుతో వెలుగులోకి..
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తాట్యాతండా జీపీ పరిధిలోని పిల్లిగుంట్ల తండాలో ఇద్దరు ల్యాబ్టెక్నీషియన్లు, ఇద్దరు ఆర్ఎంపీలు ముఠాగా ఏర్పడి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని తెలిసి అధికారులు దాడులు నిర్వహించారు. వారి నుంచి స్కానింగ్మిషన్, సెల్ఫోన్లు, కారును పోలీసులు స్వాధీనం చేసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని అధికారులు తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆర్ఎంపీలు..
గ్రామాల్లోని ఆర్ఎంపీలు వైద్యారోగ్యశాఖ సూచనలు ఏమాత్రం కేర్ చేయడం లేదు. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ _2010 ప్రకారం ఆర్ఎంపీలు రోగనిర్ధారణ చేసి మందులు ఇవ్వడం, ఇంజక్షన్ ఇవ్వడం, మందుల కోసం ప్రిస్క్రిప్షన్ రాయకూడదు. ఇన్ పేషెంట్ వైద్యం చేయకూడదు, ల్యాబ్ లు నిర్వహించవద్దు. అబార్షన్లు, కాన్పులు వంటి హైరీస్క్ చికిత్సలు చేయవద్దు. ఇతర ఆస్పత్రులకు సిఫారసు చేయడం లాంటివి నిషేధం కానీ, ఈ నిబంధనలు పాటించడం లేదు.
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు..
మహబూబాబాద్ జిల్లాలో గిరిజన జనాభా ఎక్కువగా ఉంది. వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని లింగ నిర్ధారణ, అబార్షన్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. గ్రామాల్లోని ఆశ కార్యకర్తలు, అంగన్వాడీల ద్వారా నిఘా పెంచాం. ఎక్కడైనా స్కానింగ్ లకు పాల్పడితే మెడికల్, పోలీస్ఆఫీసర్లకు సమాచారమిస్తే చర్యలు చేపడతాం. - కళావతి భాయ్, డీఎంహెచ్వో, మహబూబాబాద్ జిల్లా