భద్రాచలం, వెలుగు: మెడికల్ ఆఫీసర్లు సమయ పాలన పాటించాలని ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు ఆదేశించారు. తన చాంబరులో బుధవారం జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పీహెచ్‌సీలు, సబ్సెంటర్లలో పని చేసే సిబ్బంది సకాలంలో విధులకు హాజరై వైద్యం చేయాలన్నారు. ఏరియా ఆసుపత్రుల్లో కూడా మెడికల్ ఆఫీసర్లు ఈ సూచనలు పాటించాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో సబ్ సెంటర్లకు వైద్య సిబ్బంది వెళ్లడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. సిబ్బందికి ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, మరమ్మతుల కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. డీఎంఅండ్‌హెచ్‌వో డా.దయానందస్వామి, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రామకృష్ణ, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
ఓవరాల్ ఛాంపియన్ గా భద్రాచలం
భద్రాచలం, వెలుగు: గిరిజన జోనల్ క్రీడలు బుధవారంతో ముగిశాయి. ఓవరాల్ ఛాంపియన్‌గా భద్రాచలం గిరిజన గురుకుల కాలేజీ నిలిచింది. అండర్–-14 విభాగంలో గేమ్స్, అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ను భద్రాచలం గిరిజన గురుకులం, అండర్–-17 విభాగంలో గేమ్స్ ఓవరాల్ ఛాంపియన్స్ గా నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి, అండర్–-17 అథ్లెటిక్స్ ఓవరాల్ ఛాంపియన్ షిప్‌ను భద్రాచలం గిరిజన గురుకులం సాధించాయి. అండర్–19 గేమ్స్ అథ్లెటిక్స్ ఓవరాల్ ఛాంపియన్ షిప్‌ను భద్రాద్రికొత్తగూడెం జిల్లా అంకంపాలెం గురుకులం సాధించాయి. విజేతలకు బహుమతులు అందించారు.
కిన్నెరసానిలో..
పాల్వంచ: మండలంలోని కిన్నెరసాని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో మూడు రోజులుగా జరుగుతున్న జోనల్ స్థాయి బాలుర క్రీడలు ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి గురుకులాల కార్యదర్శి ఎం శ్రీనివాస్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు.
రేషన్ బియ్యం పట్టివేత
బూర్గంపహాడ్,వెలుగు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని బూర్గంపహాడ్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. మండలంలోని అంజనాపురం గ్రామం నుంచి తరలిస్తున్న 28 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నట్లు అడిషనల్ ఎస్ఐ రమణారెడ్డి తెలిపారు. పట్టుబడిన బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.
పాల్వంచ: మండలంలోని జగన్నాధపురం వద్ద వాహన తనిఖీల్లో రూ.7 లక్షల విలువ చేసే పీడీఎస్ బియ్యాన్ని రూరల్ ఎస్ఐ ఎం శ్రీనివాస్ స్వాధీనం చేసుకున్నా రు. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎస్ డబ్ల్యూసీ గోదామ్ పక్కనే ఉన్న సైరా ఆగ్రో రైస్ మిల్ యజమానులు ఎస్కే నవీజ్, ఎండీ బిలాల్ సూచన మేరకు 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తీసుకెళ్తున్నట్లు లారీ డ్రైవర్ సెంటుమియా అంగీకరించినట్లు ఎస్ఐ చెప్పారు.
బేడా మండపంలో రామయ్యకు అభిషేకం
భద్రాచలం, వెలుగు: బేడా మండపంలో శ్రీసీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు బుధవారం అభిషేకం జరిగింది. ఉదయం గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించాక ఉత్సవమూర్తులను బేడా మండపానికి తీసుకెళ్లారు. అక్కడ పాలు,పెరుగు, పంచదార, తేనె, నెయ్యితో సీతారాములకు పంచామృతాభిషేకం నిర్వహించారు. వేదపారాయణాలు జరిగాయి. కల్యాణమూర్తులను ప్రాకార మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం జరిపించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, యజ్ఞోపవీతం, జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక తర్వాత మంత్రపుష్పం నివేదించారు. భక్తులు కంకణాలు ధరించి స్వామి వారి కల్యాణ క్రతువును నిర్వహించారు.
9 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు
అశ్వారావుపేట, వెలుగు: మండల టీచర్లు తొలిమెట్టు కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేశారనే కారణంతో వారిపై డీఈవో సోమశేఖర్ శర్మ బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారని ఎంఈవో కృష్ణయ్య తెలిపారు. మంగళవారం డీఈవో తనిఖీ చేయగా, 9 మంది టీచర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలిందని చెప్పారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారని చెప్పారు. జమ్మగూడెం స్కూల్ టీచర్స్ విజయలక్ష్మి, వెంకటేశ్, బాలాజీ, వీరబాబు, రమాదేవి, ఊట్లపల్లి స్కూల్ కు చెందిన మణి, మోహన్ రావు, పేటమాలపల్లి స్కూల్ టీచర్స్ కృష్ణవేణి, హరి కుమార్‌లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. వీరిలో హరి కుమార్‌ను గుంటేమడుగు స్కూల్‌కు బదిలీ చేసినట్లు ఎంఈవో చెప్పారు.
ఎమ్మెల్యే కందాల కృషితో కేసు పరిష్కారం
కూసుమంచి, వెలుగు: భక్త రామదాసు ఎత్తిపోతల పథకం నుంచి ఎస్సారెస్పీ కాలువల నిర్మాణంలో భూములు నష్టపోతున్న రైతులు పరిహారం సరిపోదని 9 ఏండ్ల క్రితం కోర్టులో వేసిన కేసు పరిష్కారం అయ్యేలా ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి చొరవ చూపారని రైతులు, న్యాయవాది తెలిపారు. బుధవారం కూసుమంచిలో మీడియాతో మాట్లాడుతూ కోర్టు కేసు కారణంగా అప్పటి నుంచి 10 గ్రామాలకు ఎస్సారెస్సీ కాలువ నిర్మాణం జరగక, 6 వేల ఎకరాలకు సాగు నీరు అందలేదని చెప్పారు. నీటి పారుదల శాఖ అధికారులు, సీఎస్‌తో ఎమ్మెల్యే మాట్లాడి రైతులకు పరిహారం ఇప్పించడంతో పాటు లోక్ అదాలత్ ద్వారా రైతులు కేసును ఉపసంహరించుకొనేలా కృషి చేశారని తెలిపారు. అడ్వకేట్ లక్ష్మీనారాయణ, రైతులు లచ్చిరావు, శ్రీరామ్, తేజావత్ శ్రీను, సీతారాములు, సోమ్లా, బెల్లంకొండ నాగన్న, బెల్లంకొండ మధు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
మున్సిపాలిటీలోని గండగలపాడులో బుధవారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాములు నాయక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ముందుగా వార్డు కౌన్సిలర్ కర్నాటి నందిని, హనుమంతరావు ఆధ్వర్యంంలో సాయిబాబా ఆలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ జైపాల్, వైస్ చైర్మన్ సీతారాములు, ఏఎంసీ చైర్మన్ రత్నం, మిట్టపల్లి నాగేశ్వరరావు, జడ్పీటీసీ కనకదుర్గ, కట్టా కృష్ణార్జునరావు, డి కోటయ్య, మచ్చ బుజ్జి, నాయకులు దార్న శేఖర్, మరికంటి శివ, పణితి సైదులు, షేక్ సైదులు, చల్లా సతీశ్, ఎం సురేశ్ పాల్గొన్నారు.
సాగర్ కాల్వ కట్టలు సేఫ్
పెనుబల్లి, వెలుగు: కల్లూరు డివిజన్ పరిధిలోని నాగార్జున సాగర్ కాల్వ కట్టలు సురక్షితంగా ఉన్నాయని ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో 82వ కిలోమీటరు వద్ద జరుగుతున్న కాల్వ గండి పనులను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లూరు డివిజన్లోని పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం నుంచి వేంసూరు మండలం కుంచపర్తి వరకు 76.78 కిలోమీటరు నుంచి 101.360 కిలోమీటర్ల మధ్య ఉన్న 25కిలోమీటర్ల సాగర్ కాల్వ కట్టలను పరిశీలించామని ఎక్కడ గండ్లు పడే ప్రమాదం లేదని తెలిపారు. గండి పనులను పూర్తి చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. డీఈ రామారావు, జేఈ కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.
ప్లాంటేషన్ సర్వే చేయాలని ఆందోళన
చండ్రుగొండ,వెలుగు: తాము పోడు సాగు చేస్తున్న భూములను ఫారెస్ట్ ఆఫీసర్లు లాక్కొని వేసిన ప్లాంటేషన్లను సర్వే చేయాలని సీతాయిగూడెం, మద్దుకూరు గ్రామాల్లో పోడుదారులు ఆందోళన చేశారు. వంద ఎకరాలలో పోడు భూములు సాగు చేస్తుండగా, అందులో ప్లాంటేషన్ వేశారని సీతాయిగూడెం గ్రామానికి చెందిన 70 మంది పోడు రైతులు వాపోయారు. మద్దుకూరు గ్రామంలో పోడు భూముల్లో ప్లాంటేషన్ చేశారని తహసీల్దార్ రవికుమార్ కు వినతిపత్రం అందచేశారు. విషయాన్ని జిల్లా ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్తామని ఎంపీడీవో అన్నపూర్ణ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.