రాష్ట్రంలో వైద్య విప్లవం .. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నం: హరీశ్ రావు

  • ఒకప్పుడు వైద్యమే అందని ములుగులో ఇక వందమంది డాక్టర్లు ఉంటరు  
  • దేశంలో తెలంగాణ నుంచే ఎక్కువ మంది డాక్టర్లు వస్తున్నరన్న మంత్రి  
  • ములుగు, నర్సంపేటలో మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన 

రాష్ట్రంలో వైద్య విప్లవం కొనసాగుతోందని, ఇది సీఎం కేసీఆర్​ విజన్ వల్లే సాధ్యమైందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. జిల్లాకో మెడికల్​కాలేజీని ఏర్పాటు చేస్తుండడంతో దేశవ్యాప్తంగా తెలంగాణ నుంచే ఎక్కువ మంది డాక్టర్లు వస్తున్నారని చెప్పారు. 


గురువారం ములుగులో మెడికల్ కాలేజీ, జిల్లా ఆస్పత్రిలో నవజాత శిశు సంరక్షణ కేంద్రం,  రాంచంద్రాపూర్ లో 33/11కేవీ సబ్ స్టేషన్ తో పాటు మహబూబాబాద్ జిల్లా మరిపెడ, తొర్రూర్ లో 100 బెడ్ల ఆసుపత్రుల నిర్మాణానికి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం గృహలక్ష్మీ, దళితబంధు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అలాగే వరంగల్ నర్సంపేటలోనూ మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రెండు చోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో హరీశ్ రావు మాట్లాడారు. ‘‘కేసీఆర్​నిరంతరం ప్రజల కోసమే ఆలోచిస్తుంటారు. ఆయనే లేకుంటే ములుగు జిల్లా అయ్యేదా? మెడికల్ కాలేజీ వచ్చేదా?’’ అని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఏడాది నాటికి మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తవుతుందని, ఇక్కడి నుంచి వంద మంది డాక్టర్లు వస్తారని చెప్పారు. ఒకప్పుడు ములుగులో వైద్యమే అందేది కాదని, ఇప్పుడు 400 బెడ్ల ఆస్పత్రితో వందల మందికి వైద్యం అందించే స్థాయిలో అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. మాజీ జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ బతికుంటే మెడికల్​కాలేజీ శంకుస్థాపన చూసి సంతోషించేవారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్న డెలివరీల్లో ములుగు జిల్లా రాష్ట్రంలోనే రెండోస్థానంలో ఉందని తెలిపారు. 

గిరిజన వర్సిటీ ఏర్పాటు ఏమైంది? 

తెలంగాణ అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని, విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించాలని మెలిక పెట్టి రూ.30 వేల కోట్లు నిలిపివేసిందని హరీశ్ రావు ఆరోపించారు. ‘‘ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని అక్టోబర్​1న తెలంగాణకు వస్తున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఏమైంది” అని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి స్కీమ్​కు స్ఫూర్తి ములుగు జిల్లానేనని, ఉద్యమ సమయంలో ఆ పథకానికి కేసీఆర్ మనసులో ఇక్కడే బీజం పడిందని పేర్కొన్నారు. ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు 12 లక్షల మందికి రూ.11వేల కోట్లు అందించామన్నారు. ‘‘దేశంలో అత్యధికంగా పోడు పట్టాలిచ్చిన రాష్ట్రం తెలంగాణే. మొత్తం 4 లక్షల 6వేల ఎకరాలకు  పట్టాలు ఇచ్చాం. పోడు రైతులపై ఉన్న కేసులు ఎత్తివేశాం” అని చెప్పారు. కేసీఆర్ పాలనతోనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని, మరోసారి బీఆర్ఎస్ ను దీవించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

రేవంత్ 10 కోట్లకు  టికెట్లు అమ్ముకుంటున్నడు.. 

ఎమ్మెల్యే టికెట్లను పీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి రూ.10 కోట్లకు అమ్ముకుంటున్నాడని హరీశ్ రావు ఆరోపించారు. ఈ విషయం కాంగ్రెస్ లీడర్లే చెబుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలేమో గానీ.. ఆ పార్టీ పవర్​లోకి వస్తే ఆరుగురు సీఎంలు మారడం మాత్రం ఖాయమని విమర్శించారు. ఇక్కడ రూ.4 వేల పింఛన్ ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్.. వాళ్లు అధికారంలో ఉన్న చత్తీస్​గఢ్, కర్నాటకలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో రెండే మెడికల్ కాలేజీలు ఉండగా, ఇప్పుడా సంఖ్యను 29కి పెంచామని తెలిపారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులతో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందన్నారు. ఇప్పుడు దేశం తెలంగాణ వైపు చూస్తున్నదన్నారు.