మల్లారెడ్డి హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఎంప్యానల్‌‌‌‌మెంట్‌‌‌‌ను రద్దు చేయండి

హైదరాబాద్, వెలుగు: డీమ్డ్‌‌‌‌ యూనివర్సిటీ పేరిట తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తున్న మల్లారెడ్డి మెడికల్, డెంటల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటళ్ల ఆరోగ్యశ్రీ ఎంప్యానల్‌‌‌‌మెంట్‌‌‌‌ను రద్దు చేయాలని ప్రభుత్వానికి తెలంగాణ మెడికల్ స్టూడెంట్స్‌‌‌‌ అండ్ పేరెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. డీమ్డ్‌‌‌‌ యూనివర్సిటీల వల్ల స్థానిక విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, వాటిని అడ్డుకోవాలని కోరుతూ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాకు అసోసియేషన్ ప్రెసిడెంట్ దాసరి రవి ప్రసాద్ తదితరులు ఆదివారం వినతిపత్రం అందజేశారు. 

మల్లారెడ్డితో పాటు అపోలో, సీఎంఆర్ తదితర మెడికల్ కాలేజీలు కూడా డీమ్డ్‌‌‌‌ యూనివర్సిటీ స్టేటస్‌‌‌‌ కోసం యూజీసీకి దరఖాస్తు చేసుకున్నాయని, వాటికి కూడా యూజీసీ నుంచి అనుమతులు వస్తే సుమారు 500 కన్వీనర్ కోటా సీట్లు మేనేజ్‌‌‌‌మెంట్ కోటా కిందకు వెళ్లిపోతాయని మంత్రికి వివరించారు. ఆయా కాలేజీలకు డీమ్డ్‌‌‌‌ యూనివర్సిటీ హోదా ఇవ్వకుండా యూజీసీని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. డీమ్డ్‌‌‌‌ యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహకాలను నిలిపివేయాలని, ఆయా కాలేజీలకు అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటళ్ల ఆరోగ్యశ్రీ ఎంప్యానల్‌‌‌‌ను రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీలకు  డీమ్డ్‌‌‌‌ హోదా ఇవ్వకుండా యూజీసీని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. మెడికల్ సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే దక్కాలన్న ఆలోచనతోనే జీవో 33 తీసుకొచ్చామని చెప్పారు. ఈ విషయంలో రాజీపడేది లేదన్నారు. మరో వారం రోజుల్లో కౌన్సెలింగ్ ప్రారంభించి, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఇచ్చిన గడువులోగా కౌన్సెలింగ్ పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ విషయంలో పిల్లలు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసానిచ్చారు.