హైదరాబాద్, వెలుగు: ఆయుష్, అల్లోపతి మెడి కల్ కోర్సుల ఫీజులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రూ.లక్షల్లో ఫీజులు ఉండగా, మరోసారి ఫీజుల పెంపు అంశాన్ని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) పరిశీలిస్తోంది. 2023–24 నుంచి 2025–26 అకడమిక్ ఇయర్‌కు సంబంధించిన ఫీజులు ఖరారు చేసేందుకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ పీజీ, సూపర్ స్పెషాలిటీ, ఎంబీబీఎస్, డెంటల్, పారామెడికల్, బీఎస్సీ నర్సింగ్, ఆయుష్ కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీలు ఆడిట్, ఫీజులకు సంబంధించిన వివరాలను సమర్పించాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి 30లోగా ఈ వివరాలు ఇవ్వాలని కోరింది. ఫీజు పెంపునకు సంబంధించిన ప్రపోజల్స్‌ను కూడా పంపించాలని ఆదేశించింది. ప్రస్తుతం ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా ఫీజు రూ.60 వేలు ఉండగా, మేనేజ్‌మెంట్ కోటా(బీ కేటగిరీ) సీటు ఫీజు కాలేజీని బట్టి రూ.11 నుంచి 15 లక్షల వరకు ఉంది. సీ కేటగిరీ సీటు ఫీజు.. బీ కేటగిరీకి రెట్టింపు ఉంది.
కేఎంసీకి 10 పీజీ సీట్లు మంజూరు
వరంగల్‌సిటీ/హైదరాబాద్, వెలుగు: వరంగల్కాకతీయ మెడికల్ కాలేజీకి10 పోస్టు గ్రాడ్యూయేట్ సీట్లు మంజూరయ్యాయి. అందులో అయిదు సీట్లు నెఫ్రాలాజీ విభాగానికి మంజూరు కాగా, మరో 5 ఎమర్జెన్సీ మెడికల్ విభాగానికి కేటాయించారు. ఈ మేరకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నుంచే కొత్తగా కేటాయించిన సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా డీఎంఈ రమేశ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎమర్జెన్సీ మెడిసిన్ సీట్లు అం దుబాటులోకి రావడం ఇదే మొదటిసారి అని మంత్రి పేర్కొన్నారు.