AP News: పొలం అమ్మి రాజధానికి రూ.25లక్షలు విరాళం ఇచ్చిన విద్యార్థిని..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అమరావతిని ఏపీ రాజధానిగా నిర్ణయించింది. రాజధాని కోసం పెద్ద ఎత్తున భూసమీకరణ చేసింది. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మించాలని ప్రణాలికను సిద్ధం చేసింది అప్పటి ప్రభుత్వం. ప్రణాళికకు తగ్గట్టుగానే రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇచ్చినప్పటికీ కేంద్రం నుండి ఆశించిన స్థాయిలో సాయం అందకపోవటంతో రాజధాని నిర్మాణం ఆశించిన స్థాయిలో జరగలేదు. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడు రాజధానుల నినాదం పైకి తేవటంతో అమరావతి ఎక్కడ మొదలైందో అక్కడే ఆగినట్లయ్యింది.

వైసీపీ మూడు రాజధానుల అంశానికి చట్టపరమైన అడ్డంకులు ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్ అటు అమరావతికి కాకుండా, ఇటు మూడు రాజధానులకు కాకుండా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. అయితే, 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో చారిత్రాత్మక విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతికి పునర్వైభవం తెచ్చేందుకు నడుం బిగించింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

ఈ క్రమంలో రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వానికి ప్రజల నుండి కూడా మద్దతు లభిస్తోంది. రాజధాని నిర్మాణానికి తమవంతు సాయం చేయటానికి ముందుకు వస్తున్నారు ఏపీ ప్రజలు. మెడిసిన్ చదువుతున్న విద్యార్థిని అంబుల వైష్ణవి రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం కోసం తన వంతు సాయంగా 25లక్షల రూపాయలను సీఎం చంద్రబాబుకు అందజేసింది.

ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి శనివారం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడుని శనివారం కలిసి విరాళం అందించారు. అమరావతి నిర్మాణానికి రూ.25 లక్షలు, పోలవరం ప్రాజెక్టుకు రూ.1 లక్ష చొప్పున విరాళం ఇస్తూ సీఎం చంద్రబాబుకు చెక్కు అందించారు. తమకున్న మూడు ఎకరాల భూమిలో ఎకరా అమ్మగా వచ్చిన రూ.25 లక్షలను రాజధానికి, తన బంగారు గాజులు అమ్మగా వచ్చిన రూ.1 లక్షను పోలవరానికి విరాళంగా అందించినట్లు వైష్ణవి తెలిపారు.

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందిస్తూ రాజధాని నిర్మాణం కోసం వైష్ణవి పొలం అమ్మి మరీ విరాళం ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. ప్రస్తుతం విద్యార్థిగానే ఉన్న వైష్ణవి....తండ్రి సహకారంతో రాజధాని కోసం, పోలవరం కోసం విరాళం ఇవ్వడం ఎంతో గొప్ప విషయమని, నేటి యువతకు వైష్ణవి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు చంద్రబాబు.ఇలాంటి యువత కలలు తమ ప్రభుత్వం నిజం చేస్తుందని చంద్రబాబు అన్నారు.స్ఫూర్తి దాయకంగా నిలిచిన వైష్ణవిని సీఎం అమరావతి కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు తెలిపారు.