
ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నట్లు ఆమె తండ్రి నరేందర్ తెలిపారు. మెడికో ప్రీతీ తండ్రి నరేందర్, ఆమె సోదరుడు పృథ్వీ వరంగల్ సీపీ రంగనాథ్ ను కలిశారు. ప్రీతి ఆత్మహత్య కేసులో సీపీతో మాట్లాడి తమ అనుమానాలు నివృత్తి చేసుకున్నామన్నారు. సిరంజి దొరికిందని..ప్రీతి శరీరంలో విష పదార్థాలు కూడా ఉన్నట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చిందని సీపీ చెప్పారన్నారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూపెట్టలేదన్నారు. పోలీసుల దర్యాప్తు నిష్పాక్షింగా జరుగుతుందని తాము నమ్ముతున్నామన్నారు.. చార్జ్ షీట్ లో ఇంకా కొందరి పేర్లు చేరుస్తామని సీపీ చెప్పారన్నారు.
కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ధరావత్ ప్రీతి ఆత్మహత్య చేసుకునే చనిపోయినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎ.వి. రంగనాథ్ చెప్పారు. మెడికో ప్రీతి మృతి కేసుపై శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రీతి మరణానికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిందని, అందులో ‘డెత్ డ్యూ టు పాయిజన్’ అని తేల్చినట్లు వెల్లడించారు. పోలీసుల విచారణలోనూ దాదాపు అదే విషయం తేలిందన్నారు.
ఫిబ్రవరి 22న ఎంజీఎంలో ప్రీతి అపస్మారక స్థితిలో పడి ఉన్నచోట సిరంజీ దొరికిన విషయాన్ని తాము అప్పుడే చెప్పామన్నారు. కానీ అక్కడ నీడిల్ దొరకకపోవడం వల్లే కన్‍ఫ్యూజన్ ఏర్పడిందన్నారు. దగ్గర్లోని డస్ట్ బిన్ లో చాలా నీడిల్స్ ఉండటంతో ప్రీతి ఇంజక్షన్ తీసుకునేందుకు వాడిన నీడిల్ ను సేకరించలేకపోయామని సీపీ చెప్పారు. దాదాపుగా అప్పుడే ప్రీతిది ఆత్మహత్యేనని 99 శాతం నిర్ధారణకు వచ్చామన్నారు. ఆమె సక్సీనైల్ కోలిన్ అనే ఇంజక్షన్ తీసుకున్నట్లు భావిస్తున్నామని చెప్పారు. అయినా, ప్రీతి ఆత్మహత్యకు సీనియర్ స్టూడెంట్ డాక్టర్ సైఫ్ ప్రధాన కారణమన్నారు. అతని ర్యాగింగ్ వల్లే మానసిక ఒత్తిడికి గురై ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు.