ధ్యానం మనోశాంతికి దివ్య ఔషధం

ధ్యానం మనోశాంతికి  దివ్య ఔషధం

మానవులు ఆధునిక హైటెక్ యుగంలో ఉరుకులు, పరుగుల జీవితంలో‌‌‌‌ చిక్కుకొని ఆందోళనకు, ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి స్థితిలో మనిషికి ప్రశాంతతను చేకూర్చే ఆయుధం ధ్యానం.  ధ్యానం మనసును శాంతపరిచి మనలో  దాగివున్న అనంతమైన శక్తిని, యుక్తిని  గుర్తించడంలో  సహాయపడుతుంది. ధ్యానం చేయడం వల్ల మనసు ఆరోగ్యంగా ఉంటుంది.

 ధ్యానం చేయడం మొదట్లో  కష్టమనిపించినా ఆ తర్వాత  సాధనతో  సులభమవుతుంది. ధ్యానం చేయడం వల్ల  జీవితంలో ముందుకు సాగడానికి కావల్సిన సామర్థ్యం చేకూరుతుంది. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా,  ధ్యానం, ప్రాణాయామం ముఖ్యమైనవి. ఈ మూడు మానవులను  అన్ని రకాల ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉంచుతాయి.  ధ్యానం శాంతి,  కరుణ,  ఐక్యత,  పరోపకారం,  సహకారం, సహనం పెంచి పోషించే  శక్తిమంతమైన సాధనం. 

ధ్యానం ఒక మతం కాదు 

ప్రతి మతంలో ధ్యానానికి మూలాలు ఉన్నాయి. ప్రతి మతం  ప్రేమ, కరుణ, శాంతి సేవలను అందిస్తాయి. కానీ, కాలక్రమేణా వాటిని మరిచిపోయి  మత సంఘర్షణలకు, హింసకు పాల్పడడం శోచనీయం.  జీవితాన్ని నిలబెట్టేవి నిజమైన ఆధ్యాత్మిక విలువలే.  ధ్యానం వల్ల ఆధ్యాత్మిక,  ధార్మిక,  మానవీయ విలువలు ఇనుమడిస్తాయి.  ధ్యానం మనిషి శారీరక,  మానసిక ఆరోగ్యంలో గుణాత్మక మార్పులు తెస్తుంది. 

ధ్యానం వల్ల సమయ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచి అలసిన మనసుకు తక్షణమే శక్తిని అందిస్తుంది.  ధ్యానం మానవులను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని రెట్టింపు చేస్తుంది.  ఐక్యరాజ్య సమితి  డిసెంబర్ 21న  ప్రపంచ ధ్యాన దినోత్సవం నిర్వహిస్తోంది.  ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న  సవాళ్లను  పరిష్కరించే  సామర్థ్యం  ధ్యానానికి ఉందని ఐరాస  గుర్తించింది.  ధ్యానం మనసుకు  ప్రశాంతతను చేకూరుస్తుంది. 

ధ్యానంతో సవాళ్లకు పరిష్కారం

ధ్యానం  మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.  సంఘర్షణలకు పరిష్కారం చూపిస్తుంది.  సమాజంలో క్షీణిస్తున్న మానవీయ విలువలు,  విశ్వాసం, పరస్పర  సంబంధాలను మెరుగుపరుస్తుంది.  భావావేశాల నియంత్రణ జరిగి ధ్యానంతో ఆటుపోట్లను తట్టుకునే శక్తి పెరుగుతుంది.   ఆందోళనను అదుపులో ఉంచేందుకు ధ్యానం  దివ్య ఔషధం.  

ధ్యానంతో  మెరుగైన మానసిక ఆరోగ్య జీవనశైలి ఏర్పడుతుంది.  సానుకూల  మానసిక స్థితి,  ఆరోగ్యకరమైన శక్తిని పెంచుతుంది.  చిత్తవైకల్యం  తగ్గిస్తుంది.  ధ్యానం ఆధునిక ప్రపంచ సవాళ్ళను పరిష్కరించే ఆయుధం. కఠిన పరిస్థితుల్లో  మనిషిలో కరుణను సంఘీభావాన్ని పెంచి  పరస్పరం ఇచ్చి పుచ్చుకునే మానసిక స్థితి ధ్యానం వల్ల మెరుగు పడుతుంది.   మనిషి  మనసుల్లో  పేరుకుపోయిన  భేదభావాలను అధిగమించి  మానవత్వం, శాంతి,  సహనం పరిమళించే విధంగా ధ్యానం 
ఉపయోగపడుతుంది.  

యోగాకు అంతర్జాతీయ గుర్తింపు

కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పాఠశాలల్లో,  కళాశాలల్లో  ధ్యానం, యోగా,  ప్రాణాయామం  పాఠ్యాంశంగా చేర్చి  విద్యార్థుల్లో చదువుల వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించే చర్యలు చేపట్టాలి.  యువతలో  మనో నిబ్బరం,   ఆత్మస్థైర్యాన్ని పెంచి పోషించే  అధ్యయనం,  అభ్యసనం  ప్రక్రియను ప్రవేశపెట్టాలి.  యువతలో ఆత్మస్థైర్యం పెంచి ఆత్మహత్యలను నివారించాలి.  సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కోసం  ప్రణాళికలు  అమలు చెయ్యాలి. 

ధ్యానంతో  హింసారహిత సమాజ నిర్మాణంలో  పౌర సమాజం భాగస్వామ్యాన్ని  ప్రోత్సహించాలి.    వ్యాపార  సంస్థలు,  కార్పొరేట్ కంపెనీలు,  వివిధ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులకు యోగా,  ధ్యానం  ప్రాణాయామం ప్రాక్టీస్ చేయడానికి  ధ్యాన కేంద్రాలను కౌన్సెలింగ్  కేంద్రాలను ఏర్పాటు చేయాలి.   ప్రతి రోజు ఒక గంట ధ్యానం చేసేవిధంగా  పని గంటలు నిర్ణయించేలా విధి విధానాలు అమలు చేయాలి.  ధ్యానం వల్ల ఉద్యోగుల్లో ఉత్పాదక,  శ్రామిక సామర్థ్యం  పెరిగి ఉత్పత్తి ఉత్పాదకత పెరుగుతుంది. 

 సమాజంలో  సంపూర్ణ  ఆరోగ్య సంరక్షణ కోసం ఊతంగా నిలిచే ధ్యానాన్ని ఐరాస నిర్దేశించిన సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధనకు  ఉపకరించేటట్టు,  దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు చేయాలి.    యోగాకు అంతర్జాతీయ గుర్తింపు రావడంలో ముందున్న  భారత్  ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తంగా  విస్తరించడానికి మార్గదర్శిగా నిలవాలి.   విశ్వస్థాయిలో మనోశాంతి వికాసంలో భారత్ విశ్వ గురువుగా ఎదగాలని ఆశిద్దాం.

- నేదునూరి కనకయ్య,యోగా, ధ్యాన కేంద్రం సలహాదారు-