మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన నిపుణుల కమిటీ

మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన నిపుణుల కమిటీ

మహదేవపూర్, హైదరాబాద్, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్  మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను ఎక్స్ పర్ట్స్  కమిటీ ఆఫ్  జుడీషియల్  కమిషన్  టీమ్ ఈఎన్​సీ (జి) అనిల్ కుమార్  నేతృత్వం లో పరిశీలించింది. శనివారం బ్యారేజీకి చేరుకున్న టీమ్  సభ్యులు.. కుంగిన బ్లాక్ లో రిపేర్లు జరుగుతున్న పిల్లర్లను పరిశీలించారు. బ్యారేజీల్లో జరుగుతున్న పనుల గురించి ఇరిగేషన్ ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో వెల్డింగ్​తో కట్ చేస్తున్న గేట్లను త్వరలో  తొలగించడానికి ఏర్పాట్లు చేశారు. 

డౌన్  స్ట్రీంలో వేస్తున్న షీట్ ఫైల్స్ ను, తొలగించిన తరువాత బేస్ లో కంకర వేసి తిరిగి అదే చోట ఫిలప్  చేస్తున్న సీసీ బ్లాక్ లను చూశారు. పిల్లర్ల లోపలి నుంచి  వస్తున్న ఊట నీటిని పరిశీలించారు. కుంగిన పిల్లర్ల వద్ద జరుగుతున్న పనులకు వాడుతున్న కెమికల్ ను పరిశీలించి గ్రౌటింగ్  వర్క్ గురించి ఆరా తీశారు. బ్యారేజీలను ఎన్ఐటీ వరంగల్  ప్రొఫెసర్  రమణ, హైదరాబాద్ ఓయూ ప్రొఫెసర్  రాజశేఖర్, మెకానికల్  అడ్వైజర్  రిటైర్డ్  ఈఎన్​సీ ఈఆర్ సత్యనారాయణ పరిశీలించారు.  

మేడిగడ్డకు రూ.2 కోట్లు..మిగతా రెండింటికి రూ.2 కోట్లు

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో టెస్టులు చేసేందుకు పూణేకు చెందిన సెంట్రల్​ వాటర్​ అండ్​ పవర్​ రీసెర్చ్​ స్టేషన్​ (సీడబ్ల్యూపీఆర్ఎస్​) సమాయత్తమవుతున్నది. సోమవారం నుంచి ఆ మూడు బ్యారేజీల వద్ద టెస్టులు చేసేందుకు సంస్థ అంగీకరించింది. ఆ టెస్టులకు అయ్యే ఖర్చులపై ప్రభుత్వానికి సంస్థ నివేదించిందని, ఖర్చులను భరించేందుకు సర్కారు కూడా అంగీకరించిందని అధికారులు చెప్తున్నారు. మూడు బ్యారేజీలకు కలిపి రూ.4 కోట్లు ఖర్చవుతాయని సంస్థ స్పష్టం చేసినట్టు తెలిసింది. 

భారీగా డ్యామేజీ అయిన ఒక్క మేడిగడ్డ బ్యారేజీకే రూ.2 కోట్లు ఖర్చు అవుతాయని సంస్థ ప్రతినిధులు తెలిపినట్టు తెలిసింది. అయితే, ఆ డబ్బులను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, సోమవారం వారు రాష్ట్రానికి వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే బ్యారేజీల వద్ద యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే 20వ నంబరు గేటునూ తొలగించామన్నారు. మిగతా గేట్ల తొలగింపు పనులు, షీట్​పైల్స్, గ్రౌటింగ్​ పనులూ మొదలయ్యాయని చెప్పారు.