
- ప్రాణహితలో తగ్గిన వరద
- మిగిలింది 4.5 టీఎంసీ లే
- మోటర్లను మధ్యమధ్యలో ఆపి నడుపుతున్న ఇంజినీర్లు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : ప్రాణహితలో వరద ప్రవాహం తగ్గడంతో మేడిగడ్డ బ్యారేజీ ఖాళీ అవుతోంది. బ్యారేజీ కెపాసిటీ 16.17 టీఎంసీలకు గాను గురువారం నాటికి 4.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఏప్రిల్ 1న రోజుకు 8,100 క్యుసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే గురువారం 3,650 క్యుసెక్కులకు పడిపోయింది. దీంతో కన్నెపల్లి వద్ద మోటార్లను మధ్య మధ్య ఆపి నడుపుతున్నారు. ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్‌ను ఎక్కువగా లిఫ్ట్ చేస్తే సాగునీటి అవసరాలకు ఉపయోగపడేవి. కానీ ఇప్పుడు ప్రవాహం తగ్గడంతో ఎత్తిపోయలేని పరిస్థితి ఉంది. ఎండాకాలం పూర్తయ్యే సరికి మరో 5 నుంచి 8 టీఎంసీలకు మించి వాటర్ లిఫ్ట్ చేయడం సాధ్యం కాకపోవచ్చని ఇంజినీర్లు చెప్తున్నారు.
90 రోజుల్లో 24 టీఎంసీల లిఫ్ట్..
గతేడాది జులైలో గోదావరి వరదల వల్ల కన్నెపల్లి పంప్‌హౌజ్ నీటమునిగి మోటార్లు ఖరాబైన విషయం తెలిసిందే. విదేశాల నుంచి ఇంజినీర్లను రప్పించి ఐదారు నెలల పాటు శ్రమించి మోటార్లను బాగు చేయించారు. ఈ క్రమంలో జనవరి 4 నుంచి కన్నెపల్లి పంప్‌హౌజ్ వద్ద నీళ్లను లిఫ్ట్ చేయడం ప్రారంభించారు. రోజుకు 2 టీఎంసీల చొప్పున లిఫ్ట్ చేసే 11 మోటార్లు అందుబాటులోకి వచ్చినట్లు అప్పట్లో ప్రకటించారు. రాష్ట్రంలో సాగునీటి అవసరాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కాళేశ్వరం నీళ్లను మాత్రం ఎక్కువగా లిఫ్ట్ చేయలేదు. గడిచిన 90 రోజుల్లో రోజుకు 2 టీఎంసీల చొప్పున లిఫ్ట్ చేస్తే 180 టీఎంసీలు, రోజుకొక టీఎంసీ చొప్పున అయితే 90 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేయవచ్చు. కానీ ప్రభుత్వం గడిచిన మూడు నెలల్లో కేవలం 24 టీఎంసీల నీళ్లను మాత్రమే అన్నారం బ్యారేజీలోకి లిఫ్ట్ చేసింది. అన్నారం నుంచి సుందిళ్ల, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి వరకు 24 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేశారు. ప్రతీ యేటా 225 టీఎంసీల వాటర్‌ను లిఫ్ట్ చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం కాగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 24 టీఎంసీల వాటర్‌ను మాత్రమే లిఫ్ట్ చేయడం వల్ల 10 శాతం లక్ష్యం మాత్రమే
చేరుకున్నట్లు అయ్యింది.
24 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేశాం..
మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఈ ఏడాది ఇప్పటివరకు 24 టీఎంసీల వాటర్‌ను అన్నారానికి లిఫ్ట్ చేశాం. అన్నారం నుంచి సుందిళ్ల, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి వరకు ఈ వాటర్‌ను లిఫ్ట్ చేసినం. మిడ్ మానేర్, లోయర్ మానేర్ డ్యాం వరకు కూడా వెళ్లినయి. మేడిగడ్డ బ్యారేజీలో ఉండే వాటర్ కెపాసిటీని బట్టి మోటార్లు నడిపిస్తాం.
‒ వెంకటేశ్వర్లు, భారీ సాగునీటిపారుదల శాఖ ఈఎన్‌సీ, మంచిర్యాల