మేడిగడ్డ పనులకు వరద గండం!

మేడిగడ్డ పనులకు వరద గండం!
  • రిపేర్లు పూర్తవ్వడానికి ఇంకో పది రోజులు
  • గేట్ల కటింగ్​తో పనులు ఆలస్యం
  • కట్​ చేయాలనుకున్న 4 గేట్లలో ఒకటి మాత్రమే కట్​
  • మిగతా మూడింటిని లిఫ్ట్ చేయాలని నిర్ణయం
  • మొరాయించిన 16వ గేట్​ను లిఫ్ట్​ చేసిన అధికారులు

హైదరాబాద్, వెలుగు:  మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లకు వరద గండం పొంచి ఉంది. రుతుపవనాలు ప్రవేశించడంతో చాలా చోట్ల వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ల పనులు వీలైనంత వేగంగా చేపట్టాలని అధికారులు టార్గెట్  పెట్టుకున్నారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రిపేర్లను సమాంతరంగా పూర్తిచేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులను చేయిస్తున్నారు. మరోవారం పది రోజుల్లో తాత్కాలిక ఉపశమన పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. అయితే, బ్యారేజీలో గేట్ల కటింగ్​ కష్టమని అధికారులు చెప్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గేట్లను కట్​ చేసేంత సమయం లేదని అంటున్నారు. ఒక్కో గేట్​ కటింగ్​కు నాలుగైదు రోజులు పడుతుండడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటున్నట్లు తెలుస్తున్నది. వరద వచ్చే లోపు ఏడో బ్లాక్​కు మరింత డ్యామేజీ జరగకుండా ఉండాలంటే.. గేట్లు ఎత్తడమే శ్రేయస్కరమని అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి తొలుత భారీగా డ్యామేజ్​ అయిన గేట్లను పూర్తిగా తొలగించాల్సిందేనని ఎన్​డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచించింది. తర్వాత వాటికి మరో రెండు గేట్లనూ తీసేయాలని అధికారులు స్పష్టతకు వచ్చారు. అందులో 20వ నంబర్​ గేటును కట్​ చేసి తొలగించారు. అయితే, కట్​ చేసి తొలగించాలనుకున్న మిగతా మూడు గేట్లను (19, 21, 22) కూడా ఇప్పుడు ఎత్తాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. జాగ్రత్త చర్యలు తీసుకుంటూ గేట్లు లిఫ్ట్​ చేస్తే ఏ సమస్యా ఉండదని చెబుతున్నారు. మరోవైపు ఇటీవల లిఫ్ట్​ చేస్తుండగా సమస్య తలెత్తిన 16వ నంబర్​ గేటును అధికారులు ఎట్టకేలకు లిఫ్ట్​ చేశారు. గురువారం సాయంత్రం ఆ గేటును వంద మీటర్ల ఎత్తు వరకు లేపారు. గత నెలలో ఆ గేటును ఎత్తుతుండగా శబ్దాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గేటును ఎత్తే ప్రయత్నాన్ని ఉపసంహరించుకున్నారు. తాజాగా ఆ గేటును లిఫ్ట్  చేశారు. 

ఇంకా రాని సీడబ్ల్యూపీఆర్ఎస్​.. చేతులెత్తేసిన ఎన్​జీఆర్ఐ

బ్యారేజీల వద్ద జియోఫిజికల్, జియోటెక్నికల్​ టెస్టులు చేయలేమని నేషనల్​ జియోఫిజికల్​ రీసర్చ్​ ఇన్ స్టిట్యూట్​ (ఎన్​జీఆర్ఐ) చేతులెత్తేసినట్లు తెలిసింది. తమ వద్ద ఆ టెస్టులు చేసేందుకు సరైన పరికరాలు, యంత్రాలు లేవని ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​కు తెలిపినట్లు సమాచారం. ఎన్​డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో సీడబ్ల్యూపీఆర్ఎస్​(సెంట్రల్​ వాటర్​ పవర్​ రీసెర్చ్ స్టేషన్​), ఎన్​జీఆర్ఐ, సీఎస్ఎంఆర్ఎస్​(సెంట్రల్​ సాయిల్  మెటీరియల్ ​ రీసర్చ్​ స్టేషన్) తో జియోఫిజికల్, జియోటెక్నికల్​ టెస్టులు చేయించాలని సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. సీడబ్ల్యూపీఆర్ఎస్​ నిపుణులు ఇప్పటికే వచ్చి బ్యారేజీలను పరిశీలించి వెళ్లారు. రిపేర్లుకు రూ.నాలుగు కోట్లు ఖర్చవుతాయని వారు సర్కారుకు తెలిపారు. అయితే, ఇప్పటి వరకు వాళ్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దర్యాప్తుకు సంబంధించి ఇప్పటికే సీడబ్ల్యూపీఆర్ఎస్​కు ఇరిగేషన్​ అధికారులు లేఖ రాసినట్లు సమాచారం. అయితే, సీడబ్ల్యూపీఆర్ఎస్  అధికారులు ఎప్పుడొస్తారో క్లారిటీ లేదు. మరోవైపు సీఎస్ఎంఆర్ఎస్​ నిపుణులు ఇప్పటికే అక్కడ టెస్టులు చేస్తున్నారు. 

వానాకాలం గడిచాకే జియో బ్యాగ్స్​

మేడిగడ్డ బ్యారేజీ వెనుక నీటి మళ్లింపుకు కాఫర్​ డ్యామ్​ కట్టాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. దాని ప్లేస్​లో జియో బ్యాగ్స్​తోనే కట్ట నిర్మించేందుకు సర్కారు అంగీకారం తెలిపినట్లు, మరికొద్ది రోజుల్లో సంస్థ ప్రతినిధులు అక్కడ జియో బ్యాగ్స్ తో కట్ట నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం  కన్నెపల్లి పంప్​హౌస్​ వద్ద నీటిని ఎత్తిపోసుకునేంత ఎత్తులో నీళ్లున్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వానాకాలం పూర్తయ్యాకే జియో బ్యాగ్స్​ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరోవైపు బ్యారేజీ ఏడో బ్లాక్​ వద్ద పనులు జరుగుతున్న ప్రాంతానికి వరద నీరు రాకుండా ఇప్పటికే కట్ట నిర్మించామని అధికారులు తెలిపారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలోనూ నాలుగైదు చోట్ల సమస్య తీవ్రత ఉందని, వాటి దగ్గర కూడా పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. మొత్తంగా వారం పది రోజుల్లో తాత్కాలిక ఉపశమన పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.