మేడిగడ్డపై ఏం చేద్దాం .. ఇప్పటికీ రిపోర్టు ఇవ్వని కేంద్ర జలశక్తి శాఖ

మేడిగడ్డపై ఏం చేద్దాం .. ఇప్పటికీ రిపోర్టు ఇవ్వని కేంద్ర జలశక్తి శాఖ
  • ఫిబ్రవరిలోనే ఎన్​డీఎస్​ఏ నుంచి కేంద్రానికి రిపోర్టు
  • రిపోర్టు వస్తేనే ఏదైనా చేయొచ్చంటున్న అధికారులు
  • ఈ నెల 30న జలసౌధలో అధికారులతో ప్రత్యేక మీటింగ్​

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ రిపోర్టు విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్ఏ) ఇప్పటికే చాలా జాప్యం చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అదే తీరు వ్యవహరిస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు గల కారణాలు, తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ ఫిబ్రవరిలో ఎన్​డీఎస్ఏ ఫైనల్ రిపోర్టు రెడీ చేసింది. ఆ రిపోర్టును ఆ నెల్లోనే కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. అప్పటి నుంచి రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా కేంద్రం లేట్ చేస్తున్నది. ఒకట్రెండు రోజులు.. వారం రోజులంటూ కాలయాపన చేస్తున్నది. ఇక వచ్చేది వర్షాకాలం, ఇప్పటికీ రిపోర్టు అందకపోవడంతో మేడిగడ్డ బ్యారేజీ విషయంలో ఏం చేయాలన్న దానిపై ఇరిగేషన్ శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. 

రిపోర్టు త్వరగా ఇవ్వాలంటూ కేంద్రానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిపోర్టు వచ్చేదాకా తాము కూడా ఏం చేయలేమని అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 30న తెలంగాణ అధికారులతో ఎన్​డీఎస్ఏ అధికారులు భేటీ కాబోతున్నట్టు తెలిసింది. ఆ భేటీలో రిపోర్టుపైనా చర్చించే అవకాశాలున్నాయని అంటున్నారు. శ్రీశైలం డ్యామ్ ప్లంజ్​పూల్ గొయ్యికి రిపేర్లు చేసే విషయంపై ఈ నెల 28న ఏపీ అధికారులతో అమరావతిలో సమావేశం కానున్నారు. ఆ మీటింగ్ అయ్యాక మన అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసినట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి.

రిపోర్టు వస్తేనే ఏదైనా..

కాళేశ్వరం ప్రాజెక్ట్​లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్ 2023, అక్టోబర్ 21న కుంగిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్, ఎన్​డీఎస్​ఏ విచారణకు ఆదేశించింది. ఇప్పటికే విజిలెన్స్ డిపార్ట్​మెంట్ తన తుది నివేదిక సమర్పించగా.. ఎన్​డీఎస్​ఏ మధ్యంతర నివేదిక ఇచ్చినా ఫైనల్ రిపోర్టు మాత్రం ఇవ్వలేదు. కావాల్సిన టెస్టులు చేయలేదు. ఎవిడెన్స్​ను ట్యాంపర్ చేశారంటూ నివేదిక ఆలస్యం చేసింది. ఇటీవల కేంద్రానికి రిపోర్టు సమర్పించినా.. ఆ రిపోర్టు కూడా కేంద్ర జలశక్తి శాఖ వద్దే మూలుగుతున్నది. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ విషయంలో అధికారులు ఏం చేయలేకపోతున్నారు. మేడిగడ్డలో టెంపరరీగా జియో బ్యాగ్స్​ను ఏర్పాటు చేసి నీళ్లను లిఫ్ట్​ చేసుకునే ఆలోచన చేసినా.. ఎన్​డీఎస్ఏ నుంచి మాత్రం ఉలుకుపలుకూ లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

మేడిగడ్డను పక్కనపెడితే.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచైనా నీటిని లిఫ్ట్ చేసుకునే అంశంపై పరిశీలన చేయాలని మంత్రి ఉత్తమ్, అధికారులు.. కేంద్ర జలశక్తి శాఖ, ఎన్​డీఎస్ఏ, సీడబ్ల్యూసీలతో పలుమార్లు భేటీ అయి విజ్ఞప్తి చేసినా వద్దని చెప్పారు. ఈ క్రమంలోనే ఏం చేయాలన్నా.. రిపోర్టులో సూచించిన దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తామని అధికారులు అంటున్నారు. రిపోర్టు ఎంత త్వరగా ఇస్తే అంతే త్వరగా పనులు మొదలు పెట్టేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు. వర్షాకాలం మొదలైతే.. పనులు చేసేందుకు కూడా వీలుండని పరిస్థితులు ఉంటాయంటున్నారు.

సీడబ్ల్యూపీఆర్ఎస్ పరిశీలనకు..

రిపోర్టుపై కేంద్ర జలశక్తి శాఖ లోతుగా విచారణ చేయిస్తున్నట్టు తెలుస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద పూర్తి స్థాయిలో టెస్టులు చేయించకుండా.. ఆ డేటా లేకుండా బ్యారేజీపై ఎన్​డీఎస్​ఏ రిపోర్టు సబ్మిట్ చేసింది. ఈ క్రమంలోనే రిపోర్టును పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్​ఎస్​)కి ఒపీనియన్ తీసుకుంటున్నదని చెప్తున్నారు. ఒకవేళ బ్యారేజీ వద్ద మరోసారి ఏమైనా స్టడీస్​ చేయొచ్చా? అన్న దానిపైనా అభిప్రాయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. తాము చెప్పకముందే బ్యారేజీ కుంగిన ప్రాంతంలో ఏర్పడిన గొయ్యిని గ్రౌటింగ్ చేసి పూడ్చారంటూ ఎన్​డీఎస్​ఏ మెలికపెడుతున్న సంగతి తెలిసిందే. 

అందుకే ఆ ప్రాంతంలో ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఇక, 30న నిర్వహించే భేటీలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఎన్​డీఎస్ఏ సూచనలు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దాంతోపాటు పెద్దవాగు ప్రాజెక్టుకు పడిన గండి రిపేర్లు, రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల పటిష్టత వంటి వాటిపై చర్చించే చాన్స్ ఉన్నట్టు తెలిసింది.