మెట్ పల్లి, వెలుగు: ఇప్పటికే రైల్వే లైన్, వరద కాలువ కోసం భూములు తీసుకున్నరు. మిగిలిన భూమిని బైపాస్ రోడ్డుకు ఇచ్చేది లేదు. అలైన్మెంట్ మార్చండి అంటూ జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం మేడిపల్లి రైతులు శుక్రవారం సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. రైతులు మాట్లాడుతూ తాత, ముత్తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన భూములను సాగు చేసుకుంటున్నామని, సారవంతమైన భూముల్లో నుంచి ఎన్ హెచ్ –63 బైపాస్ రోడ్డు నిర్మాణ అలైన్మెంట్ మార్చాలని కోరారు.
ఒకవేళ కచ్చితంగా సర్వే చేస్తామనుకుంటే పరిహారం ఎంత ఇస్తారో ముందే స్పష్టం చేయాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు నచ్చజెప్పినా వినలేదు. ఆర్డీవో రావాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో అధికారులు మెట్ పల్లి ఆర్డీవో దూలం మధు, తహసీల్దార్ శేఖర్ కు సమాచారమిచ్చారు. వారు మేడిపల్లికి వచ్చి రైతులను సముదాయించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. చేసేదేమీ లేక అధికారులు సర్వే చేయకుండానే వెళ్లిపోయారు.