గురువు 22.03.2023 నుంచి 21.04.2023 వరకు ద్వితీయ స్థానంలో తదుపరి 08.04.2024 నుంచి ఉగాది వరకు తామ్రమూర్తిగా సంచారం. శని 22.03.2023 నుంచి 08.04.2024 వరకు వ్యయంలో రజితమూర్తిగా సంచారం. రాహువు 22.03.2023 నుంచి 30.10.2023 వరకు ద్వితీయ అష్టమ స్థానంలో తదుపరి 08.04.2023 వరకు సువర్ణ మూర్తిగా సంచారం. కేతువు 30.10.2023 నుంచి 08.04.2024 ఉగాది వరకు జన్మస్థానంలో సువర్ణమూర్తిగా సంచారం.
ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యం. ప్రతి విషయంలో చాలా చురుకుగా ఉంటారు. రైతు సోదరులు తిథి, వారం, నక్షత్ర బలంతో వ్యవసాయ పనులు చేయండి. వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు, లాయర్లకు ఆకస్మిక ధనలాభం ఉంది. కాంట్రాక్టర్లకు సామాన్యంగా ఉంటుంది. రాజకీయ నాయకులు ప్రజల్లోకి వెళ్లే చొరవ ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వెండి, బంగారం, స్టీలు, సిమెంట్, టింబర్, కాపర్ రేట్లు నిలకడగా ఉండవు. చిన్న పరిశ్రమల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద పరిశ్రమల వారు నూతనంగా పెట్టుబడులు పెట్టరాదు. డబ్బులు కనిపించవు. కెమికల్, ఫార్మా రంగంలో నూతన డెవలప్‌మెంట్స్‌కు సమయం కాదు. మత్స్య పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, రైస్ మిల్లర్లకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. డీలర్లకు, వస్త్ర వ్యాపారులకు, కిరాణా, నూనె వ్యాపారస్తులకు కొంత బెటర్‌గా ఉంటుంది. ఫైనాన్స్, చిట్స్, షేర్స్ వారికి చాలా సమస్యలు. మీ కుటుంబంలో ఉన్న సమస్యలు సర్దుబాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముందుకుసాగాలి. మీ జీవితంలో కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి విషయంలో ఓర్పుతో చాకచక్యంగా మసలుకోవాలి. ఆదాయానికి లోటురాదు. స్థిరాస్తులు ఖరీదు చేస్తారు. నిల్వ ఉన్న ధనం ఖర్చు చేయగలరు. ఎలాంటి సమస్యలు వచ్చిన ఇట్టే పరిష్కరించుకునే చాతుర్యం కలిగి ఉంటారు. ప్రధానంగా గురువు బలంతో కార్యసాధన చేయగలరు. ధార్మిక విషయాల్లో చురుకుగా పాల్గొనగలరు. మీ ప్రతిభ మిమ్మల్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లగలదు. ఎత్తుకు పైఎత్తులతో ముందుకు సాగుతారు. గృహంలో శుభకార్యాలు జరుగును. సంతానం లేని వారికి సంతానం, వాహన యోగం ఉన్నాయి. ఆర్భాటాలకు ఇది సమయం కాదు. మీ చాతుర్యంతో ముందుకు సాగుటకు తీర్థయాత్రలు, నవగ్రహ ప్రదక్షిణాలు, జపాలు, దానాలు, మహాన్యాస రుద్రాభిషేకం, అమ్మకు కుంకుమ పూజలు మీ అభివృద్ధికి సోపానాలు కాగలవు. పూర్వాభాద్ర నక్షత్రం వారు కనక పుష్య రాగం ధరించాలి. షిరిడీ సాయిబాబా దర్శనం, గురు పూజలు, దక్షిణామూర్తికి పూజలు చేయడం వలన ఆకస్మికంగా వచ్చే విపత్తులను చక్కగా పరిష్కరించగలరు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఇంద్ర నీలం ధరించాలి. శని భగవానుడికి తైలాభిషేకం చేయాలి. నువ్వులు, నలుపు వస్త్రాలు దానం చేయాలి. గొర్రె వెంట్రుకలతో తయారుచేసిన గొంగళి దానం ఇవ్వండి. శని ప్రభావంతో ఆర్థికంగా బాగుంటుంది. రేవతి నక్షత్రం వారు జాతి పచ్చ ఉంగరం కుడి చెయ్యి చిటికెన వేలికి ధరించాలి. శ్రీవెంకటేశ్వర స్వామికి అలంకరణ చేయించి, చక్కెర పొంగలి ప్రసాదం మహానైవేద్యంగా పెట్టాలి. ధ్యానం, యోగా వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీరు, మీపై నమ్మకం పెంచుకొని చక్కనైన జీవన విధానాలతో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలరు. అదృష్ట సంఖ్య 3.
మీన రాశి మాస ఫలితాలు
చైత్ర మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సంతృప్తికరంగా ఉంటుంది. మాటకు కట్టుబడి సంఘంలో పేరు ప్రఖ్యాతి పెంచుకునేందుకు సమయం. వ్యక్తిగత విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. తొందరపాటు వలన చేతికి వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. సూర్యనమస్కారాల వలన అనంతమైన శక్తి వస్తుంది.
వైశాఖ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యంగా అనిపించే విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. ఆదాయ, వ్యయాలను బ్యాలెన్స్‌గా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు రాగలవు. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు పడతారు.
జ్యేష్ఠ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు భార్యాభర్తల మధ్య పొరపొచ్ఛాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకొని సంఘంలో గౌరవ మర్యాదలు పొందాలి.
మీ దాంపత్య ఆనందమే మీ గౌరవాన్ని పెంచుతుంది. కార్యరూపంలో సాధారణ పరిస్థితులు ఉన్నాయి. అర్థం చేసుకుని మసలుకోవాలి.
ఆషాఢ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు కొన్ని సమస్యలు ఉన్నాయి. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఉద్రేక భావనలకు అవకాశం ఉంది. కోపం, చికాకులకు ప్రధాన కారణం నదుల దగ్గర జలం ఊరుట తగ్గినప్పుడు. ఇలాంటప్పుడు అధికంగా ఉద్రేకపడతారు. నోటిలో నీరు కొద్దిసేపు పెట్టుకుంటే చిక్కులు రావు.
అధిక శ్రావణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు ప్రతి విషయంలో వ్యతిరేక భావాలు ఉంటాయి. అలాగని భయపడాల్సిన పనిలేదు. మీరు ఏకాగ్రతతో కార్యం పట్ల ఉన్న అవరోధాలు చాకచక్యంగా తొలగించుకునే సమర్థులు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గృహ శాంతి కోసం నిత్యదీపారాధన చేస్తే అనంతమైన శక్తిని ఇస్తుంది.
నిజ శ్రావణ మాసం: ఈ రాశి స్త్రీపురుషులకు సామాన్యంగా, అనుకూలంగా ఉంటుంది. మీరు ఎంత నిబ్బరంగా ఉంటే అన్ని విజయాలు పొందగలరు. మీ ప్రవర్తన, మీ ఆలోచనలు, మీ గౌరవాన్ని ఎంతో ఎత్తుకు తీసుకుపోతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ హామీ ఇవ్వొద్దు. మధ్యవర్తిగా ఉండొద్దు. నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే మంచి జరుగుతుంది.
భాద్రపద మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు ప్రతి విషయంలో ఏదో ఒక ఆటంకం. విఘ్నేశ్వరుడి ముందు ప్రతి రోజు 11 సార్లు గుంజీలు తీయండి. మీకున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. సామరస్య ధోరణితో ఆనందాన్ని పొందగలరు. తొందరపాటు వలన మానసిక ఒత్తిడి. ఇష్టమైన దైవాన్ని ఆరాధించండి.
ఆశ్వయుజ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలం. ఆదాయ వనరులు ఉన్నాయి. అలాగే ఖర్చులు కూడా ఉన్నాయి. చాలా ఆలోచన చేసి వివాహ ప్రయత్నాలు ముందడుగు వేయాలి. జాతకరీత్యా వధూవరులను సంప్రదించకుండా వివాహం చేయరాదు. మీరు తీసుకున్న జాగ్రత్తలే మీకు ఆనందాన్ని ఇస్తాయి. దైవారాధన చేయడం మంచిది.
కార్తీక మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యంగా, సంతృప్తికరంగా ఉంటుంది. కాలయాపన చేయకుండా, తొందరపాటు లేకుండా ఒక ప్లాన్ ప్రకారం ముందుకు సాగండి. ఏక నిర్ణయాల వలన చిక్కు సమస్యలు ఉంటాయి. జాగ్రత్తగా సమయాన్ని బట్టి సమర్ధులుగా ఉండండి. గాయత్రి మంత్రం సాధన చేయండి.
మార్గశిర మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యం. ప్రతి విషయంలో పట్టుదల కలిగి కార్యదీక్షాపరులుగా అనుకున్న పని సాధించగలరు. వర్గ భేదాలతో ఉండకూడదు. ఇది మీకు చాలా అమూల్యమైన సమయమని గుర్తించండి. కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. వివేకంగా ఆలోచన చేసి పరిష్కరించుకోండి. గ్రహారాధన చేయడం అవసరం.
పుష్య మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల కలయిక, విందువినోదాలతో చాలా సంతోషంగా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే పండుగ వాతావరణం ఉంటుంది. సంతానం విషయంలో అవరోధాలు ఉన్నాయి. భాగస్వామి మనసు అర్థం చేసుకుని మసులుకోండి. మహన్యాస రుద్రాభిషేకం ఆరుద్ర నక్షత్రంలో చేయుట వలన అనుకూలంగా ఉంటుంది.
మాఘ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలం. కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. పట్టుదలతో విజయం సాధించేందుకు సరైన సమయం. సాహసాలు చేసేందుకు ఇది సమయం కాదు. ఆచితూచి మాట్లాడాలి. మాటపట్టింపులు. గురువు ఆజ్ఞతో నడుచుకుంటే ఎంతటి ఇబ్బందైనా పరిష్కారం అవుతుంది.
ఫాల్గుణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులు కార్య దీక్షతో ముందుకు సాగాలి. గ్రహ కలయిక లేదు. శని ప్రభావం ఎక్కువ. శనికి తైలాభిషేకం నువ్వులు, నలుపు గొంగళి దానం చేయండి. రాహు కేతువులకు మినుములు, ఉలవలు దానం ఇస్తే ప్రశాంతత ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించి ముందుకు సాగండి. ఆటుపోట్లు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి.