సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలి.. మనకు ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకం

సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలి.. మనకు ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకం
  • సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులకు పార్టీ కొత్త ఇంచార్జీ దిశానిర్దేశం 
  • ఎమ్మెల్సీ ఎన్నికలపై జూమ్ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకమని, సిట్టింగ్ సీటును కచ్చితంగా గెలవాలని పార్టీ నేతలకు ఏఐసీసీ రాష్ర్ట వ్యవహారాల కొత్త ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. గతేడాదిగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రాడ్యుయేట్స్ లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆమె సూచించారు.

గురువారం ఎమ్మెల్సీ ఎన్నికలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన జూమ్ మీటింగ్ లో మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం, సీతక్క, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.

మీటింగ్ లో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీగా ప్రచార వ్యూహం రచించామని, 50 మంది ఓటర్లకు ఒక ఇంచార్జీని నియమించామన్నారు. వీరితో పాటు పార్టీ నేతలు, ఎన్ఎస్ యూఐ నాయకులు గ్రామ స్థాయి నుంచి వ్యూహాలు రచించాలని చెప్పారు. కాంగ్రెస్ మీద ఓటర్లకు మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ, వాళ్ళను ఓటు వేయించేలా బాధ్యత తీసుకోవాలన్నారు.

సర్కారు  సంక్షేమ పనులను బాగా ప్రచారం చేయాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంచార్జీలు పూర్తి స్థాయిలో పని చేయాలని సూచించారు. మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లతోపాటు ఎలిమినేట్ సిస్టమ్ లో ఓట్ల లెక్కింపు ఉన్నందున ప్రతి ఓటునూ చాలా ముఖ్యమైనదిగా భావించాలన్నారు. ఓటర్ మ్యాపింగ్, ఓటర్లను ప్రత్యేకంగా కలవడం, వాళ్ళను గ్రామ స్థాయి నుంచి బూత్ కు తీసుకెళ్లడం లాంటి అంశాలు చాలా కీలకమన్నారు. ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని, గాంధీ భవన్ నుంచి కంట్రోల్ రూమ్ పెట్టి నిరంతరం పర్యవేక్షించాలన్నారు.