స్కీంలను జనంలోకి తీసుకెళ్లండి : మీనాక్షి నటరాజన్

స్కీంలను జనంలోకి తీసుకెళ్లండి :  మీనాక్షి నటరాజన్
  • చేవెళ్ల, జహీరాబాద్ ఎంపీ నియోజకవర్గాలరివ్యూ మీటింగ్​లో మీనాక్షి నటరాజన్
  • సన్న బియ్యం, ప్రభుత్వ పథకాలపై ప్రజల స్పందనపై ఆరా
  • సమన్వయంతో ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు సూచన

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ పథకాలకు జనంలో విస్తృత ప్రచారం కల్పించాలని, సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం గాంధీ భవన్ లో చేవెళ్ల, జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గాల సమీక్ష సమావేశం పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. దీనికి చీఫ్ గెస్టుగా హాజరైన మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు.

ఏడాదిన్నరలో ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను పేదలు వినియోగించుకునేలా, పల్లెల్లో సైతం అవి అమలవుతున్న తీరును పర్యవేక్షించాలని నేతలకు సూచించారు. ముఖ్యంగా సన్న బియ్యం పథకం గురించి ప్రజలకు వివరించేందుకు ఇంటింటికి వెళ్లాలని కోరారు. స్థానికంగా ఏ సమస్య ఉన్నా జిల్లా, రాష్ట్ర నేతల దృష్టికి తీసుకెళ్లాలని, అవసరమైతే తనకు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. కొత్త నేతలను కలుపుకొనిపోవాల్సిన బాధ్యత పార్టీలోని నేతలపై ఉందన్నారు.

పార్టీ అంతర్గత విషయాలను బయట ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడవద్దని కోరారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఏ స్థాయి నాయకుడు మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేంది లేదని ఆమె స్పష్టం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి ఏలా ఉంది, ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయం ఏమిటి.. సంక్షేమ పథకాల అమలుపై జనం స్పందన ఎలా ఉందనే విషయాలపై ఆమె పార్టీ నేతల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయాలని మీనాక్షి నటరాజన్ సూచించారు.  మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. పల్లె, పల్లెన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను విజయవంతం అయ్యేలా చూడాలని కోరారు. ఏడాదిన్నరలోనే దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయనన్ని పథకాలను ఇక్కడ అమలు చేస్తున్నామని, దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.

పార్టీలో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, పార్టీ లైన్ ను మాత్రం ఎవరూ దాటవద్దని కోరారు. ఈ సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహా, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్, పార్టీ నేత రంజిత్ రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్​చార్జ్​లు పాల్గొన్నారు.