
- సికింద్రాబాద్, హైదరాబాద్, నిజామాబాద్ లోక్సభ స్థానాల రివ్యూలో మీనాక్షి నటరాజన్
- త్వరలో అబ్జర్వర్ల నియామకం
- వారి రిపోర్టుల ఆధారంగానే మండల, జిల్లా అధ్యక్షుల నియామకం
- లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు
- ఇయ్యాల చేవెళ్ల, జహీరాబాద్ నియోజకవర్గాలపై సమీక్ష
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో గుజరాత్ మోడల్లో పార్టీ నిర్మాణం చేపడుతామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం గాంధీ భవన్లో ఆమె నిజామాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించారు. పీసీసీ చీఫ్మహేశ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆయా నియోజకవర్గాల పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. త్వరలోనే పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని కోరారు. జిల్లాకో ఆబ్జర్వర్ ను నియమిస్తామని, వారు ఇచ్చిన నివేదిక ఆధారంగానే మండల, జిల్లా అధ్యక్షుల నియామకం ఉంటుందని ఆమె చెప్పారు.
ఇంటర్వ్యూల ద్వారా పార్టీ అధ్యక్షుల నియామక ప్రక్రియ గుజరాత్ లో ప్రారంభించారని, అదే పద్ధతి ఇప్పుడు తెలంగాణలో అమలు చేయనున్నట్లు వివరించారు. త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలపై దృష్టి పెట్టాలని, ఇప్పటి నుంచే రాబోయే పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యచరణను రూపొందించుకోవాలని కోరారు. పదవులు పొందిన వారు అనుకున్న స్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదని, చాలా మంది ఇంటికి లేదంటే వ్యక్తిగత పనులకే పరిమితం అవుతున్నారని ఆమె నేతలను హెచ్చరించినట్లు సమాచారం. బాన్సువాడ, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరంగా ఉన్న కొన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని ఆమె అక్కడి నేతలకు హామీ ఇచ్చారు.
హైదరాబద్లో ఎంఐఎంతో కాంగ్రెస్ వైఖరి ఏంటి?
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మజ్లిస్ తో కాంగ్రెస్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని ఈ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మీనాక్షి నటరాజన్ దృష్టికి నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఫిరోజ్ ఖాన్ తీసుకువచ్చారు. ఇక్కడ ఎంఐఎంతో నిత్యం కొట్లాడుతూ పార్టీని బతికించుకుంటున్నామని, ఎన్నో కేసులను, ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, అయినా తమకు పూర్తి సహకారం అందడం లేదని ఆయన మీనాక్షికి ఫిర్యాదు చేసినట్లు తెల్సింది. దీనిపై ఆమె స్పందిస్తూ మజ్లిస్ విషయంలో అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం, మధ్యాహ్నం 12. 30 గంటలకు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష జరగనుంది.
పీసీసీ కార్యవర్గం ప్రకటనలో మరింత జాప్యం
జిల్లాల వారిగా ఏఐసీసీ పరిశీలకులను నియమించనున్న హైకమాండ్, వారు ఇచ్చే రిపోర్టు ఆధారంగానే పీసీసీ కార్యవర్గంలో నేతలకు చోటు కల్పించే అవకాశం ఉంది. దీంతో కార్యవర్గం ఏర్పాటు మరింత ఆలస్యం కావచ్చనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో సాగుతున్నది. అబ్జర్వర్లను నియమించడం, ఆ తర్వాత వారు ఆయా జిల్లాల్లో పర్యటించి, అక్కడి నేతలతో మాట్లాడి, ఏఐసీసీకి నివేదిక ఇవ్వడం.. దాని ఆధారంగా నేతలకు పీసీసీలో చోటు కల్పించాల్సి ఉంది.