
- చీఫ్ గెస్టుగా మీనాక్షి నటరాజన్
హైదరాబాద్, వెలుగు: గాంధీ భవన్ లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగుకు ఇటీవలే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీగా నియమితులైన మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టులుగా అటెండ్ అవ్వనున్నారు. మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, పీసీసీ ఆఫీసు బేరర్లు పాల్గొననున్నారు. మీనాక్షి నటరాజన్ ఇన్ ఛార్జీ హోదాలో మొదటిసారి ఈ సమావేశానికి హాజరవుతున్నారు.
దాంతో పార్టీ ఇంఛార్జీ హోదాలో ఆమె ఏ విధంగా మాట్లాడనున్నారనే ఆసక్తి పార్టీ నేతల్లో నెలకొంది. అయితే, ఇది కేవలం మీనాక్షి నటరాజన్ తో రాష్ట్ర నేతల పరిచయ కార్యక్రమం మాత్రమేనని, ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, చర్చించే అంశాలు పెద్దగా ఏమీ ఉండవి పీసీసీ నేతలు అంటున్నారు. మీటింగ్ అయిపోయిన వెంటనే ఆమె తిరిగి ఢిల్లీ వెళ్లిపోనున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాగా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల విషయంలో బీసీలకు తగిన న్యాయం చేయాలని పార్టీలోని బీసీ నేతలు మీనాక్షి నటరాజన్ ను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు తెల్సింది.