
- దేశంలో పన్ను విధానం మారాలి
- ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు అందరికీ ఉన్నది
- మహిళలు రాజకీయాల్లో రాణించాలని పిలుపు
- డబ్బులు సంపాదించేందుకే రాజకీయాల్లోకి వస్తున్నరు: కోదండరామ్
- ఎన్ఏపీఎమ్ 30వ జాతీయ మహా సభకు హాజరు
హైదరాబాద్, వెలుగు: దేశంలో కార్పొరేట్ రాజ్యం నడుస్తున్నదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు రాజు మాదిరి వ్యవహరించకూడదని తెలిపారు. నెహ్రూ చెప్పినట్లు ప్రజలు, ముఖ్యంగా బడుగుబలహీన వర్గాల ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేయాలని సూచించారు. కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలను పక్కనపెట్టి.. పెట్టుబడిదారులు, మార్కెట్ వ్యవస్థ కోసం పని చేస్తున్నాయన్నారు. అలాంటి పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ప్రభుత్వాలు తీసుకునే చాలా నిర్ణయాలు.. ప్రజలు, పర్యావరణానికి వ్యతిరేకంగా ఉంటున్నాయన్నారు.
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక (ఎన్ఏపీఎమ్) ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా జరుగుతున్న 30వ జాతీయ మహాసభలు మంగళవారంతో ముగిశాయి. ఈ సదస్సుకు మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో రాజకీయ పార్టీలు, ప్రజా ఉద్యమాల పాత్రపై జరిగిన చర్చలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో కోటీశ్వరుడు, సామాన్యుడు ఒకే ట్యాక్స్ కడుతున్నాడని అన్నారు. దేశంలో ట్యాక్స్ పాలసీ మార్చాలని డిమాండ్ చేశారు. ఉత్పత్తిదారుల దేశంగా ఉండాల్సిన ఇండియా.. పెట్టుబడిదారుల దేశంగా మారిందని తెలిపారు. ఇండియాను ఉత్పత్తిదారుల దేశంగా మార్చేందుకు కాంగ్రెస్ తనవంతు కృషి చేస్తున్నదని తెలిపారు.
మహిళా సాధికారతకు కృషి చేయాలి
ప్రస్తుతం దేశంలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు సామాన్యులకు, వారి నిర్ణయాలకు చోటివ్వడం లేదని మీనాక్షి నటరాజన్ అన్నారు. ‘‘మార్కెట్ ను శాసించే వ్యక్తుల నిర్ణయాల ప్రకారం దేశంలో విధానాలు అమలు చేస్తున్నారు. ఈ పద్ధతి మారాలి. ప్రజా ఉద్యమాలు చేసేవాళ్లు మాత్రమే పేద వర్గాల తరఫున మాట్లాడుతున్నరు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య రక్షణకు, ప్రజల తరఫున పని చేయాలి. రాజకీయాల్లో మహిళలు రాణించాలి. మహిళా సాధికారతకు కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. పార్టీలకతీతంగా మహిళల ఐక్యత పెరగాలి’’అని మీనాక్షి నటరాజన్ అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో తమ సమస్యలపై ప్రభుత్వాలు, పాలకులను ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉన్నదని, దీని కోసం ప్రత్యేక అనుమతులు అవసరం లేదని అన్నారు.
డబ్బు చుట్టే రాజకీయాలు: కోదండరామ్
రాజకీయాల్లో డబ్బు సంపాదించే వాళ్లే ఎక్కువ మంది ఉన్నారని ఎమ్మెల్సీ కోదండరామ్ అన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకునే స్థితిలో రాజకీయ పార్టీల్లేవని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు కోసం వందలాది మంది ప్రాణాలు వదిలారని, రాష్ట్ర ఏర్పడ్డాక కూడా రాజకీయాల్లో మార్పు రాలేదన్నారు. అలాంటి రాజకీయాలను సరిదిద్దడానికే తాము పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా కలిసి గత అవినీతి ప్రభుత్వాన్ని ఓడించారన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం.. అవినీతిని నిర్మూలించాలని విజ్ఞప్తి చేశారు.
30 ఏండ్లలో ఎన్నో విజయాలు సాధించింది: ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రెసిడెంట్ అశోక్ ధావలే
ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక (ఎన్ఏపీఎమ్) గత 30 ఏండ్లలో ఎన్నో ప్రజా ఉద్యమాలు నిర్వహించిందని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రెసిడెంట్ అశోక్ ధావలే అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలు, భూసేకరణ చట్టాన్ని రద్దు చేయడంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ప్రస్తుతం నాలుగు లేబర్ కోడ్ లపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్నికలు, గెలుపు, ఓటముల చట్రంలో చిక్కుకోవడంతో ప్రజా సంఘాల కార్యకర్తలంతా ధైర్యంగా పోరాడలేరని సమాజ్‌వాది పార్టీ ఎంపీ జావేద్ అలీ అన్నారు. సంఖ్యాబలం ముందు ప్రజాస్వామ్యం సాగిలపడిందన్నారు. మేధా పాట్కర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో.. మహిళలపై హింసా, పెసా యాక్ట్ అమలు, రైతులకు కనీస మద్దతు ధర తదితర సమస్యలపై వక్తలు మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) సెంట్రల్ కమిటీ మెంబర్ క్లిఫ్టన్ రొజారియో, సీపీఐ నేషనల్ లీడర్ అన్నీరాజా తదితరులు పాల్గొన్నారు.